అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ట్రంప్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో హెచ్1బీ  వీసాలతో సహా వర్కింగ్‌ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అడ్డుకుంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన హెచ్1బీ వీసా నిషేధంపై స్టే విదిస్తూ ఫెడరల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ తన రాజ్యాంగ అధికారాన్ని దాటి పోయారని వ్యాఖ్యానించారు. 

నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ , టెక్ నెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు హెచ్ 1 బీ వీసా ఆంక్షల మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు.

డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ కు కరోనా పాజిటివ్...

వ్యాపారంలో ఆర్థిక పునరుద్ధరణలు, వృద్ధి ఆవిష్కరణలు అవసరమైన సమయంలో తమకు ఇలా అడ్డంకులు కల్పించారని ఈ సంస్థలు వాదించాయి. కీలకమైన కష్టసాధ్యమైన ఉద్యోగాలను నిరోధిస్తున్నవీసా పరిమితులపై ఈ తీర్పు   ఊరటనిస్తుందని పేర్కొన్నారు. 

కోవిద్ 19 నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు పలు వీసాలను నిలిపివేస్తూ జూన్ 22న ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే హెచ్‌1బీ, హెచ్‌ 4,  హెచ్ 2బీ, జే, ఎల్ వీసా సహా ఇతర విదేశీ వీసాలను జారీపై  తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.