చేతులకు బేడీలు వేసి మరీ గెంటివేత: అక్రమ వలసదారులపై అమెరికా అమానుషం
పేరుకు పెద్దన్నేగానీ నిబంధనల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించడం, మానత్వం మర్చిపోయి ప్రవర్తించడం అమెరికా నైజం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారుల విషయంలోనూ ప్రస్తుతం అలాగే వ్యవహరిస్తున్నారు. వాళ్ల చేతులకు బేడీలు వేసి స్వదేశాలకు పంపుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యతో అనేక దేశాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రెజిల్ చేరుకున్న వలసదారులు ఈ అమానుష చర్యల గురించి ఫిర్యాదు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దీనిని అమలు చేయడం ప్రారంభించారు. అమెరికా నుండి అక్రమ వలసదారులతో నిండిన విమానాలు బయలుదేరుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులను చేతులకు హ్యాండ్‌కఫ్స్, కాళ్లకు బేడీలు వేసి వారి దేశాలకు పంపుతోంది. దీంతో సంబంధిత దేశాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హ్యాండ్ కఫ్స్ వేయడం, ఎయిర్ కండిషనర్ లేని విమానంలో పంపండం లాంటి అమానుష చర్యల ఫొటోలు, వీడియోల వివరాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
బ్రెజిల్ చేరుకున్న అక్రమ వలసదారులతో వివాదం
ట్రంప్ ప్రభుత్వం బహిష్కరణ చర్యలు ప్రారంభించిన తర్వాత అక్రమ వలసదారుల బృందం బ్రెజిల్ చేరుకుంది. దీంతో కొత్త వివాదం ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ సామూహిక బహిష్కరణను వేగవంతం చేశారు. అనేక విమానాలు అక్రమ వలసదారులను గ్వాటెమాల, బ్రెజిల్ వంటి దేశాలకు తీసుకెళ్తున్నాయి. అలాంటి ఒక విమానం బ్రెజిల్‌లోని ఉత్తర నగరం మనౌస్‌లో ల్యాండ్ అయింది. అందులో 88 మంది బ్రెజిలియన్ పౌరులు హ్యాండ్‌కఫ్స్‌తో ఉన్నారు. బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ బ్రెజిలియన్ అధికారులు తమ అమెరికన్ ప్రతినిధులను "వెంటనే హ్యాండ్‌కఫ్స్ తొలగించాలని" ఆదేశించినట్లు తెలిపింది.
బ్రెజిల్ ప్రభుత్వం అమెరికాను వివరణ కోరింది
అమెరికా నుంచి పంపబడిన ఎడ్గార్ డా సిల్వా మౌరా మాట్లాడుతూ, "విమానంలో వారు మాకు నీళ్లు కూడా ఇవ్వలేదు. మా చేతులు, కాళ్లు కట్టేశారు. మమ్మల్ని టాయిలెట్‌కు కూడా వెళ్లనివ్వలేదు. చాలా వేడిగా ఉంది. కొంతమంది స్పృహ కోల్పోయారు." అని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రెజిల్ ప్రభుత్వం వలసదారుల మానవ హక్కుల "ఘోర ఉల్లంఘన"పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులతో అవమానకరంగా ప్రవర్తించిన విషయంపై అమెరికా ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

