Asianet News TeluguAsianet News Telugu

గ్లోబర్ టెర్రరిస్ట్‌గా పాక్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీ.. ఫలించిన భారత్ ప్రయత్నం..

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా (గ్లోబల్ టెర్రరిస్టు) ప్రకటించింది.

UNSC Lists Pakistan based terrorist Abdul Rehman Makki as a global terrorist ksm
Author
First Published Jan 17, 2023, 10:44 AM IST

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా (గ్లోబల్ టెర్రరిస్టు) ప్రకటించింది. అతడిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. యూఎన్ భద్రతా మండలి అల్-ఖైదా ఆంక్షల కమిటీ.. ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధం, ఆయుధాల ఆంక్షలకు లోబడి వ్యక్తులు, సంస్థల జాబితాకు అబ్దుల్ రెహ్మాన్ మక్కీని జోడించింది. గత ఏడాది జూన్‌లో యూఎన్ భద్రతా మండలి 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద మక్కీని జాబితా చేయాలనే భారతదేశం, యుఎస్ సంయుక్త ప్రతిపాదనను చైనా చివరి క్షణంలో నిలుపుదల చేసింది. అబ్దుల్ రెహ్మాన్ మక్కీని జాబితా చేయాలనే ప్రతిపాదనను నిరోధించిన తర్వాత చైనాను భారతదేశం నిందించింది.

భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం  అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. అతను భారతదేశంలో ముఖ్యంగా జమ్మూ-కాశ్మీర్‌లో నిధుల సేకరణ, యువతను హింస వైపు చేర్చడం, దాడులకు ప్లాన్ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. 2020లో పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసులో జైలు శిక్ష విధించింది.

అబ్దుల్ రెహ్మాన్ మక్కీ.. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) చీఫ్, 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్‌కు బావ. ఇక, గ్లోబల్ టెర్రరిస్టు జాబితా చేర్చడం ద్వారా ఆస్తులను స్తంభింప చేయడంతో పాటు ప్రయాణ నిషేధం విధించడం జరుగుతుంది. 

గతంలో కూడా పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టుల జాబితా చేయడంలో చైనా అడ్డంకులు సృష్టించింది. పాకిస్తాన్ ఆధారిత, యూఎన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనలను చైనా పదేపదే అడ్డుకున్న సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios