ట్రంప్ పై కేసు వేసిన మాజీ డ్రైవర్, కారణమేంటో తెలుసా?

Trump Sued By His Ex Personal Driver For Unpaid Overtime
Highlights

తన మొండి వైఖరితో యావత్ ప్రపంచానికే చెమటలు పట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కే చెమటలు పట్టించాడో సాదాసీదా డ్రైవర్. ట్రంప్ తనతో వెట్టిచాకిరీ చేయించుకొని జీతం ఎగ్గొట్టాడని ఆరోపిస్తున్నాడు సదరు డ్రైవర్

తన మొండి వైఖరితో యావత్ ప్రపంచానికే చెమటలు పట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కే చెమటలు పట్టించాడో సాదాసీదా డ్రైవర్. ట్రంప్ తనతో వెట్టిచాకిరీ చేయించుకొని జీతం ఎగ్గొట్టాడని ఆరోపిస్తున్నాడు సదరు డ్రైవర్. వివరాల్లోకి వెళితే..

డొనాల్డ్ ట్రంప్‌ వద్ద దాదాపు 25 ఏళ్లు వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేసిన నోయెల్‌ సింట్రోన్‌ (59) ఇప్పుడు అధ్యక్షుడిపై కోర్టులో దావా వేశారు. ఈ పాతికేళ్ల సమయంలో ట్రంప్ తనకెప్పుడూ ఓవర్‌టైం పే చెయ్యలేదని, 15 ఏళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే జీతం పెంచారని ఆరోపించారు. ట్రంప్ 2016లో అమెరికా అధ్యక్షునిగా నామినేషన్‌ వేశాక, నోయెల్ ఆయన దగ్గర డ్రైవర్‌గా పనిచేయటం మానేశారు.

గడచి ఆరేళ్ల కాలంలో ట్రంప్ ఆర్గనైజేషన్ వద్ద నోయెల్ దాదాపు 3,300 గంటలు ఓవర్‌టైం చేశానని, ఈ కాలంలో ట్రంప్‌ తనకు ఏనాడూ ఓటీ సొమ్మును చెల్లించలేదని, ట్రంప్‌ కుటుంబం మొత్తం తనతో వెట్టిచాకిరీ చేయించుకుందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, న్యూయార్క్‌ చట్టాలను ఉల్లంఘించి అధిక గంటలు పని చేయించుకున్నారని, ఓటీ జీతం కూడా చెల్లించలేదని నోయెల్‌ తన వాజ్యంలో పేర్కొన్నారు.

ట్రంప్ కోసం ఉదయం 7.00 గంటల నుండి పనిచేయడం ప్రారంభిస్తే, సాయంత్రం వారి అవసరం తీరిపోయే వరకూ పనిచేయాల్సి వచ్చేదని, ఒక్కోవారం కనీసం 55 గంటలకు పైగానే పనిచేశానని, ఈ మేరకు ఓటీ వేతనం కింద 2,00,000 డాలర్లను, అలాగే కోర్టు ఖర్చులు, అటార్నీ ఫీజులన్నింటినీ కలుపుకుని మొత్తం 3,50,000 డాలర్లు చెల్లించాలంటూ ట్రంప్‌పై నోయెల్‌ దావా వేశారు. కాగా.. ఈ విషయంపై స్పందించిన ట్రంప్‌ కంపెనీల కార్యదర్శి ఒకరు మాట్లాడుతూ... నోయెల్ చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని, నిజానిజాలను కోర్టులోనే తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు.

loader