గుడ్‌న్యూస్ : జూన్ 12న సింగపూర్‌లో కిమ్, ట్రంప్ సమావేశం

First Published 2, Jun 2018, 1:37 PM IST
Trump says June 12 summit with North Korea's Kim is back on
Highlights

గుడ్‌న్యూస్: ట్రంప్, కిమ్ కీలకభేటీ


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ లు ఈ ఏడాది జూన్ 12 వ తేదిన సింగపూర్ లో సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఆరంభం నుండి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ శాంతి జపాన్ని పాటిస్తున్నాడు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశానికి సిద్దమయ్యారు.


జూన్ 12వ తేదీన సింగపూర్ లో తమ సమావేశం కొనసాగనుందని ట్రంప్ స్వయంగా  వెల్లడించారు. వైట్ హౌస్ లో ఉత్తర కొరియా రాయబారి కిమ్ యోంగ్ చోల్ తో దాదాపు 80 నిమిషాల పాటు చర్చించిన అనంతరం ఈ తేదీని ఖరారు చేశారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ పంపిన లేఖను ట్రంప్ కు కిమ్ యోంగ్ చోల్ అందించారు. కొరియాను అణు రహిత దేశంగా మార్చాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ట్రంప్, కిమ్ ల భేటీ జరగనుంది. 

అయితే అణురహిత దేశంగా కొరియాను మార్చడమన్నది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని ట్రంప్ అన్నారు. ఇది ఒక్క సమావేశంతోనే అయిపోయేది కాదని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరగడం మంచి  పరిణామమని అన్నారు. ఉత్తర కొరియా అభివృద్ధి చెందాలని భావిస్తోందని, వారు ఆశిస్తున్నది జరుగుతుందని తెలిపారు. కిమ్ జాంగ్ తో తన సమావేశం ఫలప్రదం అవుతుందని చెప్పారు.

ఇటీవలనే ఉత్తరకొరియాలో అణు కేంద్రాన్ని కిమ్ ప్రభుత్వం బాంబులతో పేల్చివేసింది. ఈ ప్రక్రియ కంటే ముందే దక్షిణ కొరియాతో  చర్చలు చేసింది. అమెరికాతో చర్చలకు కూడ రెడీ అనిప్రకటించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడ కిమ్ తో సమావేశానికి ఓకే చెప్పారు. వీరిద్దరూ సింగపూర్ లో సమావేశం కానున్నారు.

loader