డోనాల్డ్ ట్రంప్ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రతీ రోజూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా "విదేశాల్లో నిర్మించిన" అన్ని సినిమాలపై 100% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇతర దేశాలు అమెరికన్ చిత్ర నిర్మాతలను ఆకర్షించడానికి పోటీ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని, దీనివల్ల అమెరికా సినిమా పరిశ్రమ నష్టపోతోందని ఆయన పేర్కొన్నారు.
విదేశీ చిత్రాల ప్రవాహాన్ని "ఇతర దేశాల కుట్ర" గా అభివర్ణించిన ట్రంప్ దీన్ని "జాతీయ భద్రతా ముప్పు" గా పేర్కొన్నారు. ఈ విదేశీ ప్రోత్సాహకాలు అమెరికా సినిమా పరిశ్రమను వేగంగా క్షీణింపజేస్తున్నాయని, గణనీయమైన ఆర్థిక నష్టాలకు కారణమవుతున్నాయని, దేశీయ చిత్రనిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయని వాదించారు.
“ఇది ప్రచారం!” అని ట్రంప్ తన పోస్ట్‌లో జోడించారు. అమెరికా తన సొంత భూభాగంలో సినిమాలు నిర్మించడంపై దృష్టి పెట్టాలని నొక్కి చెప్పారు. “మేము మళ్ళీ అమెరికాలో తెరకెక్కిన సినిమాలను కోరుకుంటున్నాము!” అని ప్రకటించారు.
వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లూట్నిక్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ: “మేము ఆ దిశగా అడుగులు వేస్తున్నాము‘ అని స్పందించారు.
ప్రాంతీయ ఉత్పత్తి ధోరణులను ట్రాక్ చేసే లాభాపేక్షలేని సంస్థ ఫిల్మ్‌ఎల్‌ఏ ప్రకారం, లాస్ ఏంజిల్స్‌లో సినిమా, టెలివిజన్ నిర్మాణం గత దశాబ్దంలో దాదాపు 40% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు సినిమా నిర్మాణాలను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన పన్ను రాయితీలు, అందిస్తున్నందున అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు.
అదనంగా సుంకాల విధింపు అమెరికా, ఇతర దేశాల మధ్య.. ముఖ్యంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చలన చిత్ర మార్కెట్ అయిన చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుంది. ట్రంప్ మునుపటి వాణిజ్య విధానాలకు ప్రతిస్పందనగా, చైనా ఇప్పటికే దేశంలోకి అమెరికన్ సినిమాల సంఖ్యను తగ్గించింది.
విదేశీ చిత్రాలపై సుంకాలు విధించాలనే చర్య అమెరికా చలన చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగించింది. అటువంటి సుంకాలకు ప్రతీకారం అమెరికా చలన చిత్ర పరిశ్రమకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని మాజీ సీనియర్ కామర్స్ డిపార్ట్‌మెంట్ అధికారి, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని సహచరుడు విలియం రీన్ష్ హెచ్చరించారు. “ప్రతీకారం మన పరిశ్రమను చంపుతుంది.దీనివల్ల అమెరికాకు లాభం కంటే నష్టమే ఎక్కువ‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్రాల నిర్మాత అయిన అమెరికా, ఇతర దేశాలు ప్రతీకార చర్యలతో ముందుకు వస్తే తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ బిలియన్ల విలువైంది, అలాంటి వాణిజ్య ఆంక్షలు అంతర్జాతీయ సహకారాలను, ప్రధాన మార్కెట్‌లకు దెబ్బతీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.