అమెరికాలో డబ్బు పంపే విదేశీయులకు ఊరట. ట్రంప్ ప్రభుత్వం రెమిటెన్స్ పన్నును 5% నుంచి 3.5%కి తగ్గించింది.
అమెరికాలో వలసదారులకు ముఖ్యంగా భారతీయులకు కొంత ఊరట కలిగించేలా ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు తమ కుటుంబాలకు డబ్బు పంపినపుడు విధించనున్న పన్నును 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు నిధులు బదిలీ చేసే వారిపై పన్ను విధించాలన్న ప్రతిపాదనపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో గతంలోనే ప్రకటించిన రెమిటెన్స్ పన్నును తగ్గిస్తూ ట్రంప్ యంత్రాంగం తాజా మార్పులు చేసింది.
ఈ బిల్లును ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’ అనే పేరుతో ఈ నెల 12న అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టగా, 215 మంది అనుకూలంగా, 214 మంది వ్యతిరేకంగా ఓటేశారు. కేవలం ఒక్క ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. అమెరికాలో నివసిస్తున్న సుమారు 44.6 లక్షల మంది భారతీయులలో చాలామంది తమ దేశాల్లోని కుటుంబ సభ్యులకు తరచూ డబ్బు పంపుతుంటారు. ఇప్పుడు ఈ కొత్త పన్ను రేటుతో, ఒక్క లక్ష రూపాయలు పంపితే దానికి 3,500 రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పన్ను 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. డబ్బు పంపే బ్యాంకులు, మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెన్సీలు ఈ పన్నును వసూలు చేసి అమెరికా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. గతంలో అమెరికా నుంచి ఇతర దేశాలకు నగదు బదిలీపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఈ మార్పులతో విదేశీయులపై మరింత భారం మోపుతోంది.
ఇదిలా ఉంటే, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత వలసదారుల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. గ్రీన్ కార్డ్ ఉన్నవారికీ భద్రత లేకుండా పోయిందని వలసదారులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల వీసాలు రద్దు చేసి వారిని అమెరికా నుంచి పంపించడంలో ట్రంప్ ప్రభుత్వం తీవ్రమైన వైఖరి అవలంబిస్తోంది. ఇటువంటి చర్యల మధ్య రెమిటెన్స్ పన్నులో చిన్న తగ్గింపు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ట్రంప్ పాలన విదేశీయులపై ఒత్తిడి కొనసాగిస్తోంది.
అదేవిధంగా, కొత్త పన్ను విధానం ప్రకారం పిల్లల పన్ను క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లకు పెంచారు. ట్రంప్ ఈ చర్యల ద్వారా సరిహద్దు భద్రతా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.