హార్వర్డ్ యూనివర్సిటీలో 31% విదేశీ విద్యార్థులు ఉండటంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యూదు వ్యతిరేకతను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

హార్వర్డ్ యూనివర్సిటీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సారి  విమర్శలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల శాతం అధికంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో సుమారు 31 శాతం మంది విదేశీయులు చదువుతున్నారంటూ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రజల డబ్బులతో బిలియన్ల డాలర్ల గ్రాంట్లు ఇచ్చి, ఆ గ్రాంట్లను ఎవరు పొందుతున్నారో చెప్పకపోవడాన్ని ఆయన విమర్శించారు.

విదేశీయులకు స్థానం ఇవ్వడం వల్ల అమెరికా విద్యార్థులకు తగిన అవకాశాలు దక్కట్లేదని ట్రంప్ అన్నారు. విదేశీ విద్యార్థులను తిరస్కరించాల్సిన అవసరం లేదన్నా, వారి శాతం అంతగా ఉండకూడదని చెప్పారు. హార్వర్డ్‌కు ఇతర దేశాల ప్రభుత్వాలు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకపోయినా, అమెరికా మాత్రం భారీగా నిధులు ఇస్తోందని ఆయన అన్నారు. అయినా, ఆ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.

ట్రంప్ మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. హార్వర్డ్‌లో ఉన్న విదేశీ విద్యార్థుల జాబితాను తమకు ఇవ్వాలని కోరారు. వారు ఎవరు? ఎక్కడినుంచి వచ్చారు? సరైన నేపథ్యం ఉన్నవాళ్లేనా? అన్న విషయాలను తెలుసుకోవాలన్నారు. చాలామంది విద్యార్థులు మంచివారేనన్న విశ్వాసం ఉన్నప్పటికీ, హార్వర్డ్ విషయంలో కొన్ని సందేహాలున్నాయని పేర్కొన్నారు.

ఇంతేకాకుండా, హార్వర్డ్‌లో యూదు వ్యతిరేకత పెరిగిపోతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనని, ఈ పరిస్థితిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించి హార్వర్డ్ క్యాంపస్‌లో జరిగిన నిరసనల నేపథ్యంలో, విదేశీ విద్యార్థులు, ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాటి మీద హార్వర్డ్ అసహనం వ్యక్తం చేస్తూ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. సదరు దావా విచారణలో శుక్రవారం ఫెడరల్ న్యాయమూర్తి ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

హార్వర్డ్ వాదన ప్రకారం, విదేశీ విద్యార్థుల నమోదు రద్దు ప్రభుత్వం భావజాలానికి అనుగుణంగా తీసుకున్న చర్యగా భావించబడుతోంది. అమెరికాలో చదువుకునే విదేశీయులకు ఇది స్పష్టమైన ప్రతీకార చర్యగా నిలిచిందని యూనివర్సిటీ అభిప్రాయపడింది.ఇదిలా ఉండగా, శనివారం మీడియాతో మాట్లాడిన ట్రంప్, హార్వర్డ్‌కు గతంలో బిలియన్ల డాలర్లు అందించామని, అయినా ఇప్పుడు వారి వ్యవహారశైలి గమనిస్తే సంస్థ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హార్వర్డ్ వద్ద ఇప్పటికే 52 బిలియన్ డాలర్ల ఎండోమెంట్ ఉందని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు గురువారం వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో, విదేశీ విద్యార్థుల నమోదు ఓ హక్కు కాదని, అది ప్రత్యేక అవకాశం మాత్రమేనని పేర్కొంది. హార్వర్డ్ నాయకత్వం సంస్థను అమెరికా వ్యతిరేక భావజాలం, యూదు వ్యతిరేకత, ఉగ్రవాద ఆలోచనలకు వేదికగా మార్చిందని ఆరోపించింది.