అదే అంటున్నావు, భేటీ లేదు: కిమ్ కు ట్రంప్ లేఖ

అదే అంటున్నావు, భేటీ లేదు: కిమ్ కు ట్రంప్ లేఖ

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో తన భేటీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్నారు. జూన్‌ 12వ తేదీన సింగపూర్‌లో జరగాల్సి ఉన్న తమ భేటీ జరగదని ట్రంప్ చెప్పారు.  కిమ్‌తో భేటీ ఉండకపోవచ్చునని బుధవారం ట్రంప్‌  వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

ఆ భేటీ జరగడం లేదని అధికారికంగా స్పష్టం చేశారు. ఈ మేరకు కిమ్‌కు ఓ లేఖ రాశారు. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు తీవ్ర విద్వేషాన్ని, బహిరంగ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ట్రంప్ ఆ లేఖలో దుమ్మెత్తిపోశారు. 

అణుపరీక్ష కేంద్రాన్ని ఉత్తర కొరియా ధ్వంసం చేసిన కొద్ది గంటలకే  ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. "మీతో చర్చల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూశాను. అయితే ఇటీవల మీ మాటల తీరు,  ప్రకటనల్లోని భాష చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు అనవసరం అనిపిస్తోంది"  అని ట్రంప్ అన్నారు..

"మన మధ్య చర్చలు గొప్పగా కొనసాగుతాయని భావించాను. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మన మధ్య చర్చలు జరుగుతాయనే ఆశిస్తున్నాను" అని అన్నారు. మనసు మార్చుకున్నట్లయితే తనతో మాట్లాడడానికి సంకోచించవద్దని ట్రంప్ ఆయనకు చెప్పారు.

ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసినందుకు కిమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా డిమాండ్‌ చేసింది. తాము ఎట్టి పరిస్థితుల్లోను అణ్వాయుధాల్ని వదిలేది లేదని, మరింత ఒత్తిడి తెస్తే చర్చల ప్రక్రియ నుంచి వైదొలుగుతామని ఇటీవల ఉత్తర కొరియా హెచ్చరించింది.

ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర కొరియా అణు పరీక్ష కేంద్రాల్ని ధ్వంసం చేసింంది. గురువారం విదేశీ జర్నలిస్టుల సమక్షంలో పంగ్యేరీ ప్రాంతంలో కొండల మధ్య ఉన్న మూడు సొరంగాలు, పలు పర్యవేక్షక కేంద్రాల్ని పేల్చివేసింది.  

ట్రంప్, కిమ్‌ భేటీ రద్దు కావడం పట్ల ఐక్యరాజ్య సమితి కార్యదర్శి ఆంటోనియో గ్యుటెర్రస్‌ విచారం వ్యక్తం చేశారు. అయితే, తాము ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని కిమ్ ప్రకటించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM INTERNATIONAL

Next page