హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్‌ శశాంక్‌ గోయల్‌ కుమారుడు శుభమ్‌ గోయల్‌ టర్కీలోని ఇస్తాంబుల్‌లో దారుణంగా హత్యకు గురయ్యారు. అమెరికాలో సాఫ్ట్  వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న శుభమ్ గోయాల్ ఈ నెల 24వ తేదీన తన స్నేహితుడు సుధాన్ష్ తో కలసి హాలిడే ట్రిప్ కోసం ఇస్తాంబుల్ వెళ్లాడు.

ఇస్తాంబుల్ లో ఓ దోపిడీ దొంగల ముఠా శుభమ్‌ను అడ్డగించి డబ్బుతో పాటు వస్తువుల్ని ఇవ్వాలని బెదిరించారు. దీంతో శుభమ్‌ వారితో వాదనకు దిగాడు. దాంతో ముఠా సభ్యులు దాడి చేసి చంపేశారు. ఇరు వర్గాల మధ్య పెనుగులాటలో దొంగలు తుపాకీతో శుభమ్‌ను కాల్చి చంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ విషయం తెలుసుకున్న తండ్రి శశాంక్‌ గోయల్‌ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లి కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల సహాయంతో మృతదేహాన్ని శనివారం రాత్రి తన స్వస్థలం ఉత్తరాఖండ్‌ రూర్కెలాకు తెప్పించినట్టు అధికార వర్గాలు చెప్పాయి. 

శుభమ్‌ కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గత నెల 28న శుభమ్‌ బంధువుల పెళ్లి కోసం భారత్‌ వచ్చి వెళ్లాడని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని అంటున్నారు. ఆదివారం సాయంత్రం శుభమ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.