కెనడాలో 20 నెలల ఓ బుడతడు పూల్‌లో పడిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత బయటకు తీసిన తర్వాత అతడి గుండె కొట్టుకోవడం లేదు. బాలుడు నిర్జీవంగా ఉన్నాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. వారు సుమారు మూడు గంటలపాటు సీపీఆర్ చేశారు. మూడు గంటల తర్వాత ఆ బాలుడి గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: ఆ బాలుడు నిజంగానే మృత్యుంజయుడు. 20 నెలల ఆ బుడతడు ఆ రోజు డే కేర్‌లో ఆడుకుంటున్నాడు. ఔట్‌డోర్‌లో ఉన్న పూల్‌లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది చిన్నారిని బయటకు తీశారు. కనీసం ఒక ఐదు నిమిషాలు ఆ బాలుడు నీళ్లలో ఉన్నాడు. అప్పటికే స్పృహ కోల్పోయాడు. అది పెద్ద నగరం కాకపోవడంతో మంచి వనరులు, సిబ్బంది గల పిల్లల హాస్పిటల్ లేదు. సమయం మించి పోతుందన్న కారణంగా ఓ చిన్న పిల్లల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రిలోని సిబ్బంది అంతా.. ల్యాబ్ వర్కర్లు, నర్సులు సహా అందరు వైద్యులు వారు చేస్తున్న పనులు వదిలిపెట్టుకున్నారు. అంతా ఆ బాలుడి చికిత్సలో నిమగ్నం అయిపోయారు. ఎట్టకేలకు ఆగిన ఆ బుడతడి గుండెను మూడు గంటల తర్వాత మళ్లీ పరుగులు పెట్టించారు.
ఈ ఘటన కెనడాలో జనవరి 24వ తేదీన జరిగింది. 20 నెలల వేలాన్ శాండర్స్ ఆ రోజు ఒంటారియాలోని పెట్రోలియాలో హోం డే కేర్‌లో ఉన్నాడు. వేలాన్ ఔట్‌డోర్ పూల్‌లో పడిపోయాడు. ఫైర్ ఫైటర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో బయటకు తీయగలిగారు. కానీ, అప్పటికే అతని గుండె కొట్టుకోవడం లేదు. అతడిని వెంటనే చార్లెట్ ఎలనార్ ఎంగల్‌హర్ట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
ఆ హాస్పిటల్‌లో అధునాతన పరికరాలు లేవు. సిబ్బంది కూడా తక్కువే. కానీ, ఆ రోజు హాస్పిటల్ సిబ్బంది అంతా ఆ చిన్నారి చుట్టే చేరారు. సుమారు మూడు గంటల పాటు వారు సీపీఆర్ చేశారు. ఛాతిపై చేతులు వేసి గుండెను మళ్లీ కదిలించడానికి, ఊపిరి తీసుకోవడానికి సీపీఆర్ చేశారు. మార్చి మార్చి ఒకరి తర్వాత ఒకరు సీపీఆర్ చేశారు.
Also Read: కరోనాకు భయపడి మూడేళ్లుగా ఇంట్లోనే వివాహిత.. భర్తను కూడా రానివ్వలేదు.. తలుపులు పగులగొట్టిన అధికారులు
‘ఇది నిజంగా అద్భుతమైన టీమ్ వరర్క్. ల్యాబ్ టెక్నిషియన్లు పోర్టేబుల్ హీటర్లను గదిలో పట్టుకున్నారు. ఈఎంఎస్ సిబ్బంది రొటేట్ చేస్తూ కంప్రెస్సర్లుగా పని చేశారు. అతడిని వెచ్చగా ఉంచడానికి నర్సులు మైక్రోవేవ్ వాటర్ రన్ చేశారు’ అని డాక్టర్ టేలర్ వివరించారు. అయితే, సమీప పెద్ద నగరమైన లండన్ నుంచి తమకు టీమ్ సపోర్ట్ నిత్యం ఉండిందని తెలిపారు.
వేలాన్‌ను ఫిబ్రవరి 6వ తేదీన డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం వేలాన్ ఇంటి వద్దే కోలుకుంటున్నాడు. ఇంటి వద్ద ఉంటే కొంత త్వరగా కోలుకుంటాడని కుటుంబం భావిస్తున్నది. అయితే, అతను సాధారణ స్థితికి రావడానికి ఇంకా చాలా కాలం పట్టే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
