తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి నిండు ప్రాణం బలైంది. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన రెండేళ్ల చిన్నారి ఇంట్లో లోడ్ చేసిన తుపాకీని ఉంచారు ఆ నిర్లక్ష్యపు తల్లిదండ్రులు. ఇంట్లో ఆటలాడుకుంటున్న ఆ బాలుడికి అది ప్రాణాలు తీసే ప్రమాదకరమైన ఆయుధమని తెలియదు పాపం.

ఆ చిన్నారి పూర్తిగా లోడ్ చేసిన ఉన్న తుపాకీతో ఆడుకుంటూ, తనకు తాను కాల్చుకున్నాడు. తల్లిదండ్రుల కళ్లముందే ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నప్పటికీ వారేమీ చేయలేకపోయారు. బుల్లెట్ గాయంతో ఉన్న చిన్నారిని టెక్సాస్‌లోని పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన కొద్ది సమయానికే ఆ చిన్నారి ఈ లోకం వదలి వెళ్లిపోయాడు.

హ్యూస్టన్ పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో చనిపోయిన చిన్నారి పేరు క్రిస్టఫర్ విలియమ్స్ జూనియర్, అతడి వయస్సు రెండేళ్లు. షూటింగ్ జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు. లోడ్ చేసిన గన్‌ను లాక్ చేయకపోవటం, నిర్లక్ష్యంగా పిల్లలకు అందుబాటులో ఉంచడం వల్లనే ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో 9ఎంఎం హ్యాండ్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తల్లిదండ్రులకు శిక్ష పడుతుందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. అమెరికాలో ఏదో ఓ చోట ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తుపాకీ చట్టాల విషయంలో అమెరికా కఠిమైన నిర్ణయాలు తీసుకునే వరకూ ఇలాంటి ఘటనలను అదుపు చేయటం కష్టం. కనీసం ఈ సంఘటనతో అయినా తల్లిదండ్రులు మేల్కొని తమ పిల్లల రక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తారని కోరుకుందాం.