చైనాలో శిశు జననా రేటు పెంచడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే డెమోగ్రఫిక్ క్రైసిస్ ఎదుర్కొంటున్న చైనాకు వధువు కట్నం ఆచారం పెను సవాల్ విసురుతున్నది. వధువు కట్నం కారణంగా డబ్బులు చెల్లించలేక యువకులు సింగిల్‌గా ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వం భారీ మొత్తంలో వధువు కట్నం డిమాండ్ చేయకూడదని క్యాంపెయిన్లు చేపడుతున్నది. 

న్యూఢిల్లీ: చైనా ఇప్పటికే జనాభా అసంతులన సమస్య ఎదుర్కొంటున్నది. పెళ్లిళ్లు తగ్గిపోవడం, జననాల రేటు ఆశించినంతగా లేకపోవడంతో చైనా కలవరపడుతున్నది. ఇప్పటికే జనాభా వేగంగా తగ్గిపోతున్నది. ఈ పరిస్థితులు ఇలాగే సాగితే దేశ జనాభా దారుణంగా పడిపోయే ముప్పు ఉన్నది. అప్పుడు వృద్ధుల సంఖ్య పెరిగితే.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపకరించే యువత లేదా వర్క్ ఫోర్స్ చాలా తక్కువగా ఉండే ముప్పు తప్పదు. ఇది దేశ ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దేశంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి ఇప్పటికే జననాల రేటు పెంచడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. క్షేత్రస్థాయిలలో క్యాంపెయినింగ్‌లు, కార్యక్రమాలు చేపడుతున్నది. తాజాగా, ఆ ప్రభుత్వానికి వధువు కట్నం ఆచారం పెను సవాల్ విసురుతున్నది. 

వధువు కట్నంతో యువకులు బెంబేలెత్తిపోతున్నారు. వధువులు అడిగే కార్లు, బంగ్లా, బోలెడు డబ్బును ఎక్కడి నుంచి తెస్తామని మ్యారేజ్ మార్కెట్ నుంచే తప్పుకుంటున్నారు. ఏళ్ల తరబడి కూడబెట్టిన డబ్బు మొత్తం ఊడ్చి వరుడి కుటుంబం వధువు కుటుంబానికి అప్పగించి కొన్నిపెళ్లిళ్లు జరుగుతున్నాయి. కానీ, పలు కుటుంబాలు మాత్రం ఇందుకు వెనుకడుగు వేస్తున్నాయి. యువత కూడా ఈ ఆచారానికి బలవుతున్నారు. పెళ్లికి దూరంగా జరుగుతున్నారు. దీంతో చాలా నగరాల్లో 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న సింగిల్ యువకులు, యువతుల సంఖ్య పెరుగుతున్నది. వధువు కట్నం తూర్పు చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది.

దీంతో చైనా ప్రభుత్వం ఈ వధువు కట్నం ఆచారానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేస్తున్నట్టు ఫెడెరికో గిలియాని అనే రైటరర్ ఇన్సైడ్ ఓవర్‌లో రాసుకొచ్చారు. ఈ ఆర్టికల్ చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ సినా వీబోలో వైరల్ అయింది.

Also Read: మెదడు తినే అమీబాతో వ్యక్తి మృతి.. ట్యాప్ వాటర్‌తో సోకిన అమీబా.. ఎలాగంటే?

మితిమీరిన వధువు కట్నం ఆచారాన్ని రూపుమాపడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ఆచారాన్ని తూలనాడాలని యువతులను ప్రభుత్వం కోరుతున్నది. ఈ స్థానిక ఆచారాన్ని పాటించవద్దని సూచనలు చేస్తున్నది. ఈ తరుణంలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. అందులో 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న యువతులు తాము పెళ్లి చేసుకునే సమయంలో కార్లు, ఇళ్లు, భారీ మొత్తంలో నగదును డిమాండ్ చేయబోమని ప్రమాణాలు చేస్తున్నారు. ఈ చర్య ద్వారా వారు పెళ్లి చేసుకోవాలని, వారు పెళ్లి చేసుకుంటే శిశు జననాల రేటు పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. 

గత ఆరు దశాబ్దాల్లో చైనా జనాభా భారీగా తగ్గిపోయింది. ఇది డెమోగ్రఫిక్ క్రైసిస్‌ను తెచ్చి పెట్టడమే కాదు.. ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తుంది.

ఈ నేపథ్యంలోనే వధువు కట్నం, ఆడంబర పెళ్లి వేడుకలకు వ్యతిరేకంగా ఈ ఏడాది 2023లో క్యాంపెయిన్లు చేపట్టాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది.