ఆరెంజ్ కలర్ లోకి మారిన న్యూయార్క్ ఆకాశం.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్.. అసలు ఎందుకు ఇలా జరిగిందంటే ?
న్యూయార్క్ సిటీలోని ఆకాశం మొత్తం నారింజ రంగులోకి మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కెనడియన్ అడవి మంటల నుంచి వచ్చిన పొగ వల్ల ఈ పరిణామం సంభవించింది.

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఆకాశమంతా ఆరెంజ్ రంగులోకి మారింది. అమెరికా ఆర్థిక రాజధాని అయిన ఈ సిటీని పొగమంచు ముంచెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామం నేపథ్యంలో నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ వాయుకాలుష్య హెచ్చరిక జారీ చేశారు. ఎయిర్ క్వాలిటీ హెల్త్ అడ్వైజరీని శుక్రవారం అర్ధరాత్రి వరకు పొడిగించినట్లు ఆయన ట్వీట్ చేశారు. కెనడాలో చెలరేగిన కార్చిచ్చు న్యూయార్క్ లో గాలి నాణ్యతను దిగజార్చిందని అడ్వైజరీ పేర్కొంది. పట్టణంలో తీవ్ర వాయుకాలుష్యం కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది.
ఈ పర్యావరణ విపత్తును ఎదుర్కోవడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వాతావరణ విపత్తుపై దిగ్భ్రాంతి, ఆగ్రహం, బాధను వ్యక్తం చేస్తూ ప్రఖ్యాత న్యూయార్క్ నగరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొందరు న్యూయార్క్ సిటీని అంగారక గ్రహంతో పోల్చారు.
‘‘ఇది అంగారక గ్రహం కాదు, ఇది నిన్న (7/6/2023) మధ్యాహ్నం న్యూయార్క్, క్యూబిక్ లోని మల్లీ యాక్టివ్ వైల్డ్ ఫైర్ నుంచి దట్టమైన పొగ ఆధిపత్య వాతావరణ ప్రసరణ ఫలితంగా ఈ ప్రాంతంపై వ్యాపించింది’’ అని ఓ ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. న్యూయార్క్ నుంచి విమానంలో ప్రయాణిస్తున్న ఓ యూజర్ దీనికి 'మార్స్' తో పోల్చాడు. ‘‘ఈ ఫొటో ఫిల్టర్ తో తయారు చేసింది కాదు.. ఈ ఉదయం నెవార్క్ (అంగారక గ్రహం) నుంచి బయలుదేరింది’’ అని అతడు పేర్కొన్నాడు.
ప్రఖ్యాత భారతీయ చీఫ్ వికాస్ ఖన్నా కూడా సిటీని రెడ్ ప్లానెట్ తో పోల్చాడు. ‘‘ఇది అంగారక గ్రహంపై మధ్యాహ్నం 1 గంట.. అంటే న్యూయార్క్ నగరం. ’’ అని ట్వీట్ చేశారు. కెనడియన్ మంటల కారణంగా కాలుష్యం సంభవించిందని నమ్మలేకపోతున్నానని మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు.
నేషనల్ వెదర్ సర్వీస్ న్యూయార్క్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్, న్యూయార్క్ సిటీ స్కైలైన్ పొగమంచుతో నిండిపోయిన టైమ్ లాప్స్ వీడియోను షేర్ చేసింది. కొందరు ఆ ఫోటోలను ఆన్ లైన్ గేమ్ తో పోలుస్తూ ఎడిట్ కూడా చేశారు. ‘ప్యాచ్ 20.2.3: న్యూయార్క్ సిటీలోకి ప్రవేశించాలంటే ఆటగాళ్లు 58వ ర్యాంక్ కలిగి ఉండాలి’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.