ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం.. మలావిలో 326కు చేరిన మృతుల సంఖ్య
ఫ్రెడ్డీ తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాను వల్ల వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. వీటి వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇలా ఈ తుఫాను కారణంగా ఇప్పటి వరకు మలావీలో 326 మంది చనిపోయారు.

ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. మలావిలో ఈ తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 326 కు పెరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు గురువారం లాజరస్ చక్వేరా ప్రకటించారు. బుధవారం వరకు ఈ విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 225గా ఉండగా.. తాజాగా 326కు చేరిందని ఆయన పేర్కొన్నారు. నిరాశ్రయులైన వారి సంఖ్య రెట్టింపు అయి 1,83,159కి చేరిందని చెప్పారు. బ్లాంటైర్ సమీపంలోని తుఫాను ప్రభావిత దక్షిణ ప్రాంతం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ వారం కుండపోత వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక మంది నిరాశ్రయులయ్యారు. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు గురువారం కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో లాజరస్ చక్వేరా ప్రపంచ సహాయం కోసం పిలుపునిచ్చారు. ఐదు రోజుల తర్వాత తొలిసారిగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక సిబ్బంది బురదలో కూరుకుపోయిన మృతదేహాలను, తుపానుకు కొట్టుకుపోయిన ఇళ్ల శిథిలాలను వెలికితీశారు.
Army Chopper Crash: కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్ చీతా , ఇద్దరు పైలట్లు మృతి
ఫిబ్రవరి చివరిలో ఈ తుఫాను మొదట దక్షిణ ఆఫ్రికాను తాకింది. మడగాస్కర్, మొజాంబిక్లలో బీభత్సం సృష్టించింది. కానీ భూపరివేష్టిత మలావిలో పరిమిత నష్టాన్ని మాత్రమే కలిగించింది. ఆ తర్వాత హిందూ మహాసముద్రం మీదుగా తిరిగిన తుఫాను వెచ్చని జలాల నుంచి మరింత శక్తిని పొంది రెండోసారి ప్రధాన భూభాగంలోకి ప్రవేశించింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఫ్రెడ్డీ మాత్రం ప్రపంచంలోనే అతి పొడవైన ఉష్ణమండల తుఫానుగా మారే అవకాశం ఉంది.
మొజాంబిక్ లో తుఫాను కారణంగా 63 మంది మరణించగా, 49,000 మంది నిరాశ్రయులయ్యారని బుధవారం అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతో దేశంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి సహాయం చేయాలని అధ్యక్షుడు ఫిలిప్పే న్యూసి కూడా విజ్ఞప్తి చేశారు. ఈ తుఫాను దాని కాల వ్యవధిలో అసాధారణమైనదని, వాతావరణ మార్పుల గురించి హెచ్చరికలకు అనుగుణంగా లక్షణాలను కలిగి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.