థాయ్‌లాండ్‌లో గుహలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.. కోచ్ సహా 12 మంది బాలలను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. జూన్ 23న ఫుట్‌బాల్ ప్రాక్టీస్ అనంతరం కోచ్ సహా 12 మంది తమ జట్టులోని ఒక సభ్యుడి పుట్టినరోజు కోసం అతన్ని సర్‌ప్రైజ్ చేసేలా పార్టీ ఏర్పాట్లు చేసేందుకు చియాంగ్ రాష్ట్రంలోని థామ్‌ లువాంగ్‌ గుహల్లోకి వెళ్లారు.. వీరంతా గుహలోకి వెళ్లిన తర్వాత కుంభవృష్టి మొదలైంది..

కొండలపై నుంచి వర్షపు నీరు గుహ ముఖద్వారం నుంచి లోపలికి వస్తుండటంతో ప్రాణాలను రక్షించుకునేందుకు వీరు ఇంకా గుహ లోపలికి వెళ్లి  చిక్కుకుపోయారు. వీరు కనిపించకుండా పోయినట్లు రాత్రి 10 గంటలకు పోలీసులు తేల్చారు.. గాలింపు చర్యలు చేపట్టిన సహాయక బృందాలకు ‘థాయ్ లువాంగ్ -ఖున్నమ్ నాంగ్నాన్ నేషనల్ పార్క్’ వద్ద 11 సైకిళ్లు కనిపించాయి. దీంతో వీరంతా గుహ లోపలికి వెళ్లినట్లు ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి వీరిని రక్షించేందుకు థాయ్‌లాండ్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.