పాక్ మియాన్ వాలీ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి.. మూడు విమానాలు ధ్వంసం.. ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన మియాన్వాలీ ట్రైనింగ్ ఎయిర్ బేస్ పై శనివారం తెల్లవారుజామున ఉగ్రదాడి జరిగింది. ఇందులో మూడు విమనాలను ఉగ్రవాదులు నేలమట్టం చేశారు. అయితే పాకిస్థాన్ సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
పాకిస్థాన్ లోని పంజాబ్ లో ఉన్న మియాన్ వాలీ ట్రైనింగ్ ఎయిర్ బేస్ పై శనివారం తెల్లవారుజామున పలువురు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. అయితే ఈ ఉగ్రదాడిని పాక్ ఆర్మీ తిప్పికొట్టింది. వారిపై కాల్పులు జరిపింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పాక్ వైమానిక దళం (పీఏఎఫ్) తెలిపింది. అయితే ఈ దాడిలో పాకిస్థాన్ వైమానికి దళాలనికి చెందిన మూడు విమానాలు కూడా ధ్వంసం అయ్యాయి.
ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం.. ఏడుగురు గల్లంతు..
ఐదారుగురు సాయుధుల బృందం తెల్లవారు జామున ట్రైనింగ్ ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడింది. దీంతో వెంటనే ప్రతిస్పందించిన పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీంతో అటు వైపు నుంచి కూడా ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అయితే ఉగ్రవాదులు వైమానిక స్థావరంలోకి ప్రవేశించడానికి ముందే దాడిని భగ్నం చేశామని పీఏఎఫ్ తెలిపింది.
బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో కనీసం 17 మంది పాకిస్తాన్ సైనికులు అమరులైన వరుస సంఘటనల తరువాత శనివారం దాడి జరిగిందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. నవంబర్ 4, 2023 తెల్లవారుజామున పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన మియాన్వాలీ ట్రైనింగ్ ఎయిర్ బేస్ పై విఫల ఉగ్రదాడి జరిగిందని, సైనికులు వేగంగా, సమర్థవంతంగా ప్రతిస్పందించడంతో అల్హుమ్డోలీలాను తిప్పికొట్టామని, సిబ్బంది, ఆస్తుల భద్రతకు భరోసా కల్పించామని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశం నుంచి ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్మూలించడానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేసింది.
ఈ దాడిలో వైమానిక దళ స్థావరంలో నిలిపి ఉంచిన మూడు విమానాలు ధ్వంసమయ్యాయని, ఒక ఫ్యూయల్ బౌజర్ కూడా ధ్వసం అయ్యిందని సైన్యం తెలిపింది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా క్లియర్ చేసేందుకు సమగ్ర జాయింట్ క్లియరెన్స్, కూంబింగ్ ఆపరేషన్ తుది దశలో ఉందని పాక్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) పేర్కొంది.
కాగా.. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-జిహాద్ పాకిస్థాన్ (టీజేపీ) ప్రకటించింది. పీఏఎఫ్ వైమానిక స్థావరం మియాన్వాలీలోని శిక్షణ, యుద్ధ విమానాలను ఫిదాయీన్ ధ్వంసం చేశాడని టీజేపీ అధికార ప్రతినిధి ముల్లా ఖాసిం పేర్కొన్నారు.
ఈ దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే అవి ఈ దాడికి సంబంధించినవే అనే విషయంపై స్పష్టత లేదు.