దుండుగులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఏడుగురు మరణించారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని పంజ్ గుర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందులో యూనియన్ కౌన్సిల్ (యూసీ) చైర్మన్, అతడితో పాటు ప్రయాణిస్తున్న మరో ఆరుగురు చనిపోయారు.
పాకిస్థాన్ లో ఘోరం జరిగింది. బలూచిస్థాన్ లోని పంజ్ గుర్ జిల్లాలో సోమవారం రాత్రి ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ల్యాండ్ మైన్ పేలింది. ఈ ఘటనలో యూనియన్ కౌన్సిల్ (యూసీ) చైర్మన్ సహా ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బల్గతర్ యూసీ చైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ తో పాటు పలువురు ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. పంజ్ గుర్ జిల్లాకు చేరుకోగానే దుండగులు రిమోట్ తో బాంబును పేల్చారని ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్ అంజాద్ సోమ్రో తెలిపారు.
హత్యాచారానికి గురైన కూతురు.. దహన సంస్కారాల సమయంలో కుప్పకూలిన తండ్రి..
వాహనం బల్గతర్ ప్రాంతంలోని చకర్ బజార్ వద్దకు రాగానే డివైస్ పేలడంతో ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు. కాగా.. మృతులను మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్ గా గుర్తించామని, వారంతా బల్తాగర్, పంజ్గూర్ కు చెందినవారని పాకిస్థాన్ వార్తా పత్రిక ‘డాన్’ నివేదించింది. మృతుల బంధువులే వారి గుర్తింపును నిర్ధారించారని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. 2014 సెప్టెంబరులో కూడా ఇదే ప్రాంతంలో ఇషాక్ బల్గాత్రి తండ్రి యాకూబ్ బల్గాత్రి, అతడి 10 మంది సహచరులు కూడా హతమయ్యారు. నిషేధిత బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ ఎఫ్ ) ఈ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇదే సంస్థ ప్రమేయం ఉందని అధికారులు అనుమానిస్తున్నట్లు ‘ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ తెలిపింది.
