Nepal interim PM Sushila Karki : నేపాల్‌లో తీవ్ర నిరసనల తర్వాత మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీ శుక్రవారం రాత్రి తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. జెన్ జెడ్ నిరసనలతో ఇంతకుముందు పీఎం రాజీనామా చేశారు.

Nepal interim PM Sushila Karki : నేపాల్‌లో కొనసాగుతున్న ఘోర నిరసనలకు తెరదించి, మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కేపీ శర్మా ఓలి రాజీనామా తర్వాత ఏర్పడిన అనిశ్చితి పరిస్థితులకు ఈ నిర్ణయం తెరదించింది. జెన్ జెడ్ నిరసనకారుల డిమాండ్లను అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, నేపాల్ ఆర్మీతో చర్చల అనంతరం అంగీకరించారు. పార్లమెంట్ రద్దుతో పాటు కార్కీని తాత్కాలిక ప్రధానిగా నియమించేందుకు మార్గం సుగమం అయింది.

Scroll to load tweet…

సుశీలా కార్కీ ఎవరు?

నేపాల్ సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి సుశీల కార్కీ. ఆమె తన న్యాయవాద జీవితం 1979లో బిరత్నగర్‌లో అడ్వొకేట్‌గా ప్రారంభించారు. 2009లో సుప్రీంకోర్టు జస్టిస్‌గా ఎదిగారు. 2016లో నేపాల్ తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా చరిత్ర సృష్టించారు. ఆ సమయంలోనే దేశంలో మూడు ప్రధాన పదవులు మహిళల చేతిలో ఉండటం విశేషం. అవి రాష్ట్రపతి, స్పీకర్, చీఫ్ జస్టిస్.

కార్కీ అవినీతిపై కఠిన వైఖరికి పేరుగాంచారు. జయప్రకాశ్ గుప్త అనే మంత్రి అవినీతి కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్ళేలా చేసిన తీర్పును ఇచ్చింది కూడా ఆమెనే.

విద్యా రంగంలోనూ ఆమె ప్రతిభ చూపారు. 1975లో వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. 1978లో త్రిభువన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ పట్టా పొందారు. విద్యార్థి దశలో నృత్యకళపై ఆసక్తి చూపిన కార్కీ, తరువాత పూర్తిగా న్యాయరంగంపై దృష్టి పెట్టారు.

నేపాల్ లో నిరసనలు ఎలా ప్రారంభమయ్యాయి?

జెన్ జెడ్ నాయకత్వంలోని యువత సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు ప్రారంభించారు. ఈ నిరసనలు త్వరగా రాజకీయ అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారాయి.

వారంరోజుల హింసలో కనీసం 51 మంది మృతిచెందారు. వారిలో ఒక భారతీయుడు, ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. 1,300 మందికి పైగా గాయపడ్డారు. కేవలం పార్లమెంట్ భవనంపై జరిగిన కాల్పుల్లోనే 19 మంది విద్యార్థులు మృతి చెందారు.

నిరసనల తీవ్రతను అదుపు చేయలేక కేపీ శర్మా ఓలి మంగళవారం రాజీనామా చేశారు. అదే రాత్రి సోషల్ మీడియా నిషేధం కూడా ఎత్తివేశారు. అయినప్పటికీ హింస కొనసాగింది. పార్లమెంట్, రాష్ట్రపతి భవనం, ప్రధాన మంత్రి నివాసం, పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్లు దహనమయ్యాయి.

చర్చల తర్వాత తగ్గిన నిరసనలు

నిరసనకారులు తమ డిమాండ్లను అధ్యక్షుడు పౌడెల్‌తో నేరుగా చర్చించారు. నేపాల్ ఆర్మీ కూడా మధ్యవర్తిత్వం చేసింది. చివరికి పార్లమెంట్ రద్దు చేసి, సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా నియమించేందుకు అంగీకరించారు.

2015 రాజ్యాంగం ప్రకారం ఈ నియామకం జరగాలంటే ముందుగా ఆమెను ఎగువ సభకు నామినేట్ చేయాల్సి ఉంది. అనంతరం ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఇది రాజ్యాంగపరంగా సాధ్యమైన మార్గం అని నిపుణులు పేర్కొంటున్నారు.

భారతదేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యత

ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారతదేశానికి నేపాల్‌లో స్థిరత్వం అత్యంత కీలకం. న్యూఢిల్లీలోని భద్రతా నిపుణుల ప్రకారం, ఖాఠ్మాండు బలహీన పాలన చైనాకు మరింత అవకాశాలు కల్పిస్తుంది.

చైనా ఇప్పటికే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రాజకీయ మద్దతు ద్వారా నేపాల్‌లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. అందువల్ల భారత్ త్వరగా సరిహద్దు ప్రాజెక్టులను పూర్తి చేయడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.