Nepal protests: నేపాల్ అల్లర్లలో మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి అగ్నిప్రమాదంలో మృతి చెందారు. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. శాంతియుతంగా ఉండాలని నేపాల్ ఆర్మీ పిలుపునిచ్చింది.
Nepal protests: నేపాల్‌లో కొనసాగుతున్న హింసాత్మక అల్లర్లలో మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకర్ మరణించారు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. ఆందోళనకారులు ఖాఠ్మాండు దల్లూ ప్రాంతంలోని వారి నివాసంపై దాడి చేశారు. ఆమెను బలవంతంగా ఇంట్లోకి తోసి.. ఇంటికి నిప్పుపెట్టారు. తీవ్ర గాయాలతో రాజ్యలక్ష్మి చిత్రకర్ ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్ లో పెద్దఎత్తున ఆందోళనలు
నేపాల్‌లో Gen-Z నేతృత్వంలోని నిరసనలు రెండో రోజు మరింత హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, నిరసనలు కొనసాగాయి. రెండో రోజు ఘర్షణల్లో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 22కి చేరింది. గాయపడిన వారి సంఖ్య 300 దాటింది.
ఖాట్మాండు సింగ్‌దుర్బార్ (ప్రధాన కార్యాలయ సముదాయం), షీతల్ నివాస్ (రాష్ట్రపతి భవనం) మంటలకు ఆహుతయ్యాయి. రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్, ప్రధానమంత్రి కేపీ శర్మా ఒలీ, మాజీ ప్రధానులు పుష్ప కమల్ దహాల్ ప్రచండ, షేర్ బహదూర్ దేవుబా ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.
నేపాల్ నాయకులపై దాడులు
నిరసనకారులు షేర్ బహదూర్ దేవుబా నివాసంపై దాడి చేసి, ఆయనతో పాటు విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా పై కూడా దాడి చేసినట్లు సమాచారం. అలాగే కేపీ శర్మా ఒలీ ఇంటికి కూడా నిప్పుపెట్టారు. ఇప్పటికే ఒలీ రాజీనామా చేశారు. మరోవైపు, 65 ఏళ్ల ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌ను నిరసనకారులు వీధిలో లాగి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేపాల్ సైన్యం శాంతి పిలుపు
నేపాల్ సైన్యం దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్మీ ప్రకటనలో, సామాజిక ఐక్యత, జాతీయ ఏకతను కాపాడాలని ప్రజలను కోరింది. “దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత రక్షణలో సైన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. యువత సహా అందరూ శాంతి, సామరస్యాన్ని కాపాడటంలో సహకరించాలని” సైన్యం పేర్కొంది.
హింసలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆర్మీ ఆకాంక్షించింది. ప్రజా, ప్రైవేట్ ఆస్తుల నష్టం దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కూడా తెలిపింది.
