Min read

Sunita Williams: హమ్మయ్యా.. మిషన్‌ సక్సెస్‌. సునీత విలియమ్స్‌ తిరుగు ప్రయాణంలో కీలక అడుగు.

Space Station Arrival SpaceX Crew 10 Prepares Sunita Williams Return
Sunita williams return to earth

Synopsis

తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగానే కీలక అడుగు పడింది.. 

కాలిఫోర్నియా: సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతరిక్షం నుంచి భూమికి తీసుకొచ్చే మిషన్ ఇంకొంచెం దగ్గరైంది. వీరిద్దరినీ భూమికి తీసుకొచ్చే స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరింది. కొత్త క్రూ-10 మిషన్ కోసం నలుగురు రీసెర్చ్ ట్రావెలర్స్ డ్రాగన్ స్పేస్‌షిప్‌లో స్టేషన్‌కు చేరుకున్నారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో క్రూ-10 మిషన్ శనివారం తెల్లవారుజామున భారత కాలమాన ప్రకారం 4.30 గంటలకు లాంచ్ అయింది.

నాసా వ్యోమగాములైన ఆనీ మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, జపనీస్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి తకుయా ఒనిషి, రోస్‌కోస్‌మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ క్రూ-10 మిషన్‌లో భాగంగా ఈరోజు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ నలుగురు ఐఎస్ఎస్ కంట్రోల్ తీసుకున్న తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వస్తారు. వీరితో పాటు క్రూ-9 మిషన్‌లోని మిగతా సభ్యులైన నాసాకు చెందిన నిక్ హేగ్, రోస్‌కోస్‌మోస్‌కు చెందిన అలెగ్జాండర్ గోర్బనోవ్ కూడా డ్రాగన్ స్పేస్‌షిప్‌లో మార్చి 19న భూమికి తిరిగి వస్తారని అంచనా వేస్తున్నారు. 

ఇదిలా ఉంటే 2024 జూన్‌ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో సునీత విలియమ్స్‌తో పాటు, బుచ్‌ విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్న విషయం తెలిసిందే. ముందు షెడ్యూల్ ప్రకారం ఇద్దరూ వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. నాసా చాలాసార్లు వీరిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించినా, హీలియం లీక్ అవ్వడం, థ్రస్టర్స్‌లో సమస్యలు ఉండటం వల్ల స్టార్‌లైనర్‌లో రిస్క్ ఉందని వాయిదా వేశారు. తాజాగా క్రూ-10లోనే వీరు తిరిగి రానున్నారు.  

 

Latest Videos