సారాంశం
ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లైవ్ స్ట్రీమ్‌లో ఏడు బాటిళ్ల స్పిరిట్ తాగాడు. ఆ బ్రాడ్‌కాస్ట్ ముగిసిన 12 గంటల తర్వాత మత్తులోనే మరణించాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పందేనికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పై లైవ్‌లో ఏడు వోడ్కా బాటిళ్లు తాగాడు. ఆ తర్వాత సుమారు 12 గంటల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.
34 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్.. సాంక్వియాంగ్ అని చాలా మందికి తెలుసు. ఆయనకు డొయిన్‌లో ఒక అకౌంట్ ఉన్నది. డొయిన్.. చైనాలో టిక్ టక్ వెర్షన్. ఆ డొయిన్‌లో సాంక్వియాంగ్ ఓ చాలెంజ్ స్టార్ట్ చేశాడు. మే 16వ తేదీన అర్ధరాత్రి దాటినాక 1 గంటలకు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో లైవ్ ప్రారంభించాడు. ఆ చాలెంజ్‌లో బైజియు అనే చైనీస్ స్పిరిట్ సేవించడం భాగమై ఉన్నది. ఇది ఒక రకమైన వోడ్కా. ఇందులో 30 శాతం నుంచి 60 శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది.
సాంక్వియాంగ్ ఫ్రెండ్ జాహో ఈ ఘటన గురించి మాట్లాడాడు. ఇలాంటి చాలెంజ్‌లలో ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒకరితో పోటీ పడి మరొకరు బాటిల్స్ తాగుతుంటారని ఆయన చెప్పాడు. అందులో గెలిచిన వారికి వ్యూయర్స్ గిఫ్ట్‌లు, రివార్డులు ఇస్తుంటారు. ఒక్కోసారి ఓడిపోయిన వారికి పనిష్మెంట్లు కూడా ఉంటాయని వివరించాడు. ఈ కేసులో బైజియు తాగడం ఉన్నదని పేర్కొన్నాడు. తాను ఈ వీడియో చూసినప్పుడు సాంక్వియాంగ్ మూడో బాటిల్ పూర్తి చేసి నాలుగో బాటిల్ చేతపట్టాడని తెలిపాడు.
వ్యూయర్స్ చెప్పిన ప్రకారం సాంక్వియాంగ్ ఏడు బాటిళ్ల బైజియు స్పిరిట్స్ సేవించాడు. ఆ లైవ్ బ్రాడ్‌కాస్ట్ ముగిసిన 12 గంటల తర్వాత మరణించాడు.
కుటుంబం ఆయనను చూడటానికి ముందే సాంక్వియాంగ్ మరణించాడు. కనీసం ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌కు కూడా నోచుకోలేదని జావో తెలిపాడు.
మితిమీరి ఆల్కహాల్ తాగడం వల్లే అతను మరణించినట్టు షాంగ్యూ న్యూస్ ధ్రువీకరించింది. ఆ తర్వాత ఉదయమే అతని అంత్యక్రియలు నిర్వహించారు. డొయిన్ లైవ్ స్ట్రీమ్స్‌లో లిక్కర్ తాగడాన్ని అంగీకరించదు. పెనాల్టీలు విధించడం నుంచి అకౌంట్ నిలిపేసే వరకు చర్యలు తీసుకుంటుంది. కానీ, కొత్త అకౌంట్లు ప్రారంభించి ఇలాంటి వారు నిబంధనలు అతిక్రమిస్తుంటారని బీబీసీ రిపోర్టులో పేర్కొన్నారు.