Israel-Hamas War Report: రాజధానిలో ప్రశాంతం, గాజా సరిహద్దులో బీభత్సం
ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎడిటర్ అజిత్ హనమక్కనవర్ గాజా సరిహద్దు నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. హమాస్ పై ప్రతీకార దాడికి ఇజ్రాయెల్ బలగాలు సిద్ధం అవుతున్నాయి. అక్టోబర్ 7న హమాస్ దాడి ఎంత దారుణంగా ఉన్నదో రోడ్లపై చెల్లాచెదరుగా పడి ఉన్న బుల్లెట్లు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: హమాస్ సాయుధులు అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై అమానవీయ దాడికి పాల్పడ్డారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ దురాగతాలతో ఈ దాడికి పోలికలు తీశారు. సుస్థిర శాంతి నెలకొనాలంటే హమాస్‌ను పూర్తిగా నాశనం చేయాలనే అభిప్రాయం ఇప్పుడు ఇజ్రాయెలీల్లో ఉన్నది.
ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ గాజా సరిహద్దుకు వెళ్లింది. ఏ క్షణంలోనైనా గాజాపై దాడికి ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నందున తమను రాజధాని నగరానికి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ సూచించింది. సరిహద్దులో బీభత్స పరిస్థితులు ఉన్నప్పటికీ రాజధాని నగరంలో మాత్రం ప్రశాంత వాతావరణమే ఉన్నది.
ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎడిటర్ అజిత్ హనమక్కనవర్ జెరూసలేం స్థానికులతో మాట్లాడారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి అక్టోబర్ 7నాటి దాడి తమపై జరిగిన అతి ఘోరమైన దాడిగా వారు చెప్పారు.
రోడ్డుపై కుప్పలుగా బుల్లెట్లు:
రోడ్డుపై కుప్పలుగా బుల్లెట్లు కనిపించాయి. ఇది హమాస్ సాయుధులు జరిపిన దాడి తీవ్రతను వెల్లడిస్తున్నది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడికి పాల్పడిన గ్రామాలకు ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ వెళ్లింది. అక్కడ రోడ్లపై చిందరవందరగా బుల్లెట్లు కనిపించాయి. గాజా పట్టి సరిహద్దుకు సమీపంలోని భవనాలు, అపార్ట్‌మెంట్లు హమాస్ రాకెట్ల దాడిలో నేలమట్టమయి ఉన్నాయి.
టెల్ అవీవ్ వైపు ప్రయాణం:
అక్టోబర్ 7న ఎదురుగా కనిపించిన వారిని విచక్షణారహితంగా హమాస్ సాయుధులు కాల్చి చంపేశారు. గర్భిణీలు, పిల్లలు అని కూడా చూడకుండా పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడి సహజంగానే హమాస్ సాయుధులను మొత్తంగా తొలిగించాలనే ఆగ్రహాన్ని రేపింది.
సరిహద్దు వద్ద 5 లక్షల మంది సైనికులను మోహరించినట్టు హమాస్ చెప్పింది. సరిహద్దు వద్దకు వెళ్లడానికి తొలుత జర్నలిస్టులకు ఇజ్రాయెలీ ఆర్మీ అనుమతించింది. తమ యాక్సిస్‌ను మాత్రం ఇజ్రాయెల్ ఆర్మీ రద్దు చేసింది. గాజా నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు తెల్లవారుజామున మేం వెళ్లగలిగాం.
Also Read: Israel-Palestine War: ‘హమాస్ ప్రయోగించిన క్షిపణి 15 సెకండ్లలో ఇక్కడకు వస్తుంది’
చీకటి పడుతున్నందున ఏ క్షణంలోనైనా యుద్ధం పెల్లుబికే ముప్పు ఉన్నందున ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ సిబ్బందిని టెల్ అవీవ్‌కు వెళ్లాల్సిందిగా ఆర్మీ కోరింది. భద్రతాపరమైన అంశాల కారణంగా ప్రతి ఒక్కరినీ రజాధానిగా వెళ్లాలని సూచించింది.
సరిహద్దు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు. అన్ని వాహనాలను ఇక్కడి నుంచి వెనక్కి పంపిస్తున్నారు.
అపాచీ హెలికాప్టర్ చక్కర్లు:
ఇజ్రాయెల్ ఆర్మీ సరిహద్దులో అపాచీ హెలికాప్టర్‌ను మోహరించింది. ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలను ఈ హెలికాప్టర్‌తో ప్రదర్శించింది. ఇజ్రాయెల్‌లో 18 ఏళ్ల వయసులో ప్రతి యువకుడు, యువతి సైన్యంలో సేవలు అందించాలి. యువకులను మూడేళ్లపాటు, యువతులను రెండేళ్లపాటు ఆర్మీలో ఉంచుతారు. ఆ తర్వాత వీరిని రిజర్వినిస్టుగా పేర్కొంటారు. దేశానికి అవసరం పడినప్పుడ వీరంతా సన్నద్ధమవుతారు. కాబట్టి, ఇజ్రాయెల్ ప్రతిపౌరుడు యుద్ధానికి సిద్ధమయ్యే ఉన్నట్టుగా భావిస్తారు.
1948 నుంచి ఎనిమిది ఘర్షణల్లో ఇజ్రాయెల్ గెలుపొందింది. అయితే, ఈ సారి పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. అత్యాధునిక సాంకేతికత, శక్తి సామర్థ్యాలు దాని సొంతం.
గాజా సరిహద్దులో అపాచీ హెలికాప్టర్ మోహరింపు ఇందుకు ఓ ఉదాహరణ. పాలస్తీనా వైపు నుంచి దాడి జరగ్గానే దాన్ని వెంటనే గుర్తించి సమర్థంగా తిప్పికొట్టడానికి ఈ హెలికాప్టర్ మోహరింపు ఉపయోగపడనుంది.