అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలు ఆగడం లేదు. తాజాగా సోమవారం షికాగోలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు.
అమెరికా : అగ్రరాజ్యం అమెరికా మరోసారి వణికిపోయింది. షికాగోలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. షికాగో సమీపంలోని హైలాండ్ పార్క్ లో స్వాతంత్ర దినోత్సవ పరేడ్ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. వేడుకల్లో భాగంగా పరేడ్ జరుగుతుండగా సమీపంలోని ఓ రీటెయిల్డ్ స్టోర్ పై నుంచి సాయుధుడైన ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు. దీంతో అక్కడున్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక తీవ్ర భయాందోళనతో అంతా తలోదిక్కు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా, జూలై 3న యూరప్లోని డెన్మార్క్ లో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని కోపెన్హాగన్లోని షాపింగ్ మాల్ లో కొంతమంది వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కాల్పులను ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఓ దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నాటి కాల్పుల్లో పలువురు గాయపడినట్లు డెన్మార్క్ పోలీసులు తెలిపారు. సిటీ సెంటర్, విమానాశ్రయం మధ్య ఉన్న అమేగర్ జిల్లాలోని పెద్ద ఫీల్డ్ మాల్ చుట్టూ పోలీసు బలగాలను మోహరించినట్లు కోపెన్ హాగన్ పోలీసులు ట్వీట్ చేశారు.
Earthquake: చైనాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదు
ఈ కాల్పుల ఘటన గురించి సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, అక్కడ చాలా మందిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని కోపెన్ హాగన్ పోలీసులు తెలిపారు. కాల్పుల సమయంలో ప్రజలు భయంతో పారిపోతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక మీడియా సంస్థలు షేర్ చేసిన ఫొటోల్లో భారీ సంఖ్యలో పోలీసులు, కనీసం పది అంబులెన్సులు కనిపిస్తున్నాయి.
