China Earthquake: చైనా మ‌రోసారి భూకంపంతో ఉలిక్కిప‌డింది. ఆదివారం ఉద‌యం సంభ‌వించిన భూకంపం రిక్ట‌ర్ స్కేల్‌పై 5.2 తీవ్ర‌త‌తో న‌మోదైంద‌ని చైనా భూకంప నెట్‌వ‌ర్కుల కేంద్రం (సీఈఎన్సీ) వెల్ల‌డించింది.

China Earthquake: చైనాలోని జిన్‌జియాంగ్‌ ఉయ్‌గుర్‌ అటానమస్‌ రీజియన్‌లో ఆదివారం 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (సీఈఎన్సీ) నివేదిక‌ల ప్రకారం.. వాయువ్య చైనాలోని అక్కీ కౌంటీలో ఉదయం 6:02 గంటలకు ( బీజింగ్ కాలమానం ప్రకారం) భూకంపం వ‌చ్చింది. భూకంప కేంద్రం 40.88 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78.14 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంద‌ని గుర్తించారు. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉందని సీఈఎన్సీని ఉటంకిస్తూ జిన్హువా నివేదించింది. శనివారం తెల్లవారుజామున 3:29 గంటలకు చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

అంతేకాకుండా, నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని మెర్‌కాంగ్ సిటీ ఆఫ్ అబా టిబెటన్-కియాంగ్ అటానమస్ ప్రిఫెక్చర్‌లో శుక్రవారం ఉదయం 00:03 గంటలకు (బీజింగ్ కాల‌మానం ప్ర‌కారం) 5.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం (సీఈఎన్సీ) తెలిపింది. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం జూన్ 6న చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతాన్ని 5.0 తీవ్రతతో మరో భూకంపం కుదిపేసింది. అయితే నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లుషాన్ కౌంటీని జూన్1న 5:00 గంటలకు 6.1 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. ఇటీవ‌ల కాలంలో చైనా భూకంపాలకు అత్యంత అవకాశం ఉన్న ప్రాంతంగా మారింది. 

సిచువాన్‌లోని యాన్ నగరంలో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సుమారు 14,427 మంది ప్రభావితమయ్యారని ప్రాథమిక గణాంకాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా నివేదించింది. నగర భూకంప సహాయ ప్రధాన కార్యాలయం ప్రకారం యాన్‌ నగరంలో సంభవించిన భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు. అలాగే, 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు, భూకంప సహాయ ప్రధాన కార్యాలయం యాన్‌లో మొత్తం 13,081 మంది భూకంపం బారిన పడ్డారని, అయితే కొత్త గణాంకాల ప్రకారం ఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు.

ఇదిలావుండ‌గా, శనివారం తెల్లవారుజామున 04:55 గంటలకు దక్షిణ ఇరాన్‌లో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్‌లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం ఐదుగురు మరణించార‌ని ఆ దేశ స్థానిక మీడియా నివేదించింది. "భూకంపంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఇప్పటివరకు 12 మంది ఆసుపత్రి పాలయ్యారు" అని ఇరాన్ గల్ఫ్ తీరంలోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో అత్యవసర నిర్వహణ అధిపతి మెహర్దాద్ హసన్జాదే వెల్ల‌డించారు.. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. భూకంప‌ బాధితుల‌కు అత్యవసర గృహాలుగా టెంట్లను అందిస్తున్నాము."