అమెరికాలో న్యూయార్క్ నగర స్కూల్స్‌లో ఈ ఏడాది నుంచి దీపావళి సెలవు అమల్లోకి రానుంది. ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోమవారం ప్రకటించారు.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దీపావళి రోజున స్కూల్స్‌కు హాలిడే ఇవ్వనున్నారు. ఈ మేరకు సోమవారం న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. ప్రతి ఏడాది వేలాది మంది న్యూయార్కర్లు చీకటిపై వెలుగు సాధించిన విజయంగా ఆ రోజున వేడుక చేసుకుంటారు. అమెరికాలోని అతిపెద్ద స్కూల్ సిస్టమ్‌లో ఈ రాష్ట్ర చట్ట సభ్యులు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. బిల్లును తెచ్చారు.
ఇది స్థానిక కుటుంబాలకు బలమైన విజయం అని మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. ‘దీపావళికి స్కూల్ హాలిడే సాధించడానికి చేసిన పోరాటంలో అసెంబ్లీ సభ్యుడు జెన్నిపర్ రాజ్ కుమార్, ఇతర కమ్యూనిటీ నేతలు తన వెంట ఉన్నందుకు గర్వంగా ఉన్నదని మేయర్ ట్వీట్ చేశారు. ఇది కొంచెం ముందే కావొచ్చుగానీ.. దీపావళి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
ఈ బిల్లును గవర్నర్ కాథి హోచుల్ తప్పకుండా సంతకం పెడతారనే విశ్వాసం తనకు ఉన్నదని మేయర్ తెలిపారు. ఈ బిల్లును గవర్నర్ కాథి హోచుల్ సంతకం పెట్టి చట్టంగా మార్చాల్సి ఉన్నది. అనంతరం, ఈ కొత్త హాలిడే అమల్లోకి వస్తుంది. స్కూల్ హాలిడే క్యాలెండర్‌లో బ్రూక్లిన్ క్వీన్స్ డే హాలిడే ఇక నుంచి దివాలి హాలిడేగా మారిపోతుంది.
ఈ నిర్ణయం ద్వారా ఈ నగరంలో ఉండి బెరుకుతో ఉండే వారికి ఒక మంచి సంకేతం ఇచ్చినట్టయిందని వివరించారు. ‘మీరంతా ఈ నగరానికి చెందినవారే. మిమ్మల్ని బయటివారుగా ఇక్కడ ఎవరూ పరిగణించడం లేదు’ అనే సంకేతాలు ఈ బిల్లు ద్వారా వెళ్లుతాయని మేయర్ వివరించారు. న్యూయార్క్ నగరం అందరిదీ.. ఎక్కడి నుంచి వచ్చినవారినైనా ఈ నగరం తనలో ఇముడ్చుకుంటుందని తెలిపారు.
ఈ ఏడాది దీపావళి నవంబర్ 12వ తేదీన వస్తున్నది. అయితే, నవంబర్ 12వ తేదీ ఆదివారం. కాబట్టి, దీపావళి సెలవు వచ్చే ఏడాది 2024 నుంచి అమల్లోకి రానుంది.
