యూకే ప్రధాని పోటీలో భారత సంతతి రిషి సునాక్ ఉన్నారు. ప్రధానమంత్రి పదవికి పోటీలో తాను నిలబడుతున్నట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. బోరిస్ జాన్సన్ కూడా బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తున్నది. లిజ్ ట్రస్ ప్రధానిగా రాజీనామా చేయడంతో మరో టోరీ నేతను ఎన్నుకోవాల్సి ఉన్నది. 

న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ఆ దేశ ప్రధానమంత్రి రేసులోకి దిగారు. ఈ రోజు ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. యూకే ప్రధానమంత్రి పోటీలో ఉన్నట్టు వెల్లడించారు. ఆయనకు ఇప్పటికే 100 ఎంపీల మద్దతు ఉన్నది. ప్రధానిగా గెలవాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు ఉన్నది.

యూకే ఒక గొప్ప దేశం అని ఆయన ట్వీట్ చేశారు. కానీ, ప్రస్తుతం ఈ దేశం ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని తెలిపారు. అందుకే తాను కన్జర్వేటివ్ పార్టీగా నిలబడుతున్నట్టు వివరించారు. తదుపరి ప్రధానిగా నిలబడుతున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని అనుకుంటున్నట్టు తెలపారు. పార్టీని ఏకం చేసి దేశానికి సేవ చేయాలని భావిస్తున్నట్టు వివరించారు.

Also Read: యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం

128 మంది టోరీ ఎంపీలతో రిషి సునాక్ ఫేవరేట్ క్యాండిడేట్‌గా ఉన్నారు. అయితే, ఆయన మాజీ బాస్ బోరిస్ జాన్సన్ కూడా తనకు 100 మంది ఎంపీల మద్దతు ఉన్నదని వివరించారు. అయితే, బోరిస్ జాన్సన్ తాను పోటీ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఏమీ చేయలేదని తెలిపారు. అంతేకాదు, మరో నేత కూడా ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది. లీడర్ ఆఫ్ కామన్స్ పెన్నీ మోర్డాంట్ కూడా ఈ పోటీలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఒక వేళ అదే నిజమైతే ఈసారి ముక్కోణపు పోటీగా మారనుంది.

బోరిస్ జాన్సన్ పార్టీ గేట్ కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో యూకేలో రాజకీయాలు ఊపందుకున్నాయి. టోరీ పార్టీలో తదుపరి పీఎంను ఎన్నుకోవడానికి తీవ్ర చర్చలు జరిగాయి. అప్పుడు ప్రధానంగా రిషి సునాక్ పీఎం పోస్టును అధిరోహించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, లిజ్ ట్రస్.. రిషి సునాక్‌ను ఓడించారు. కానీ, ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహణకు వెచ్చించిన రోజుల కన్నా కూడా ఆమె తక్కువే పీఎంగా కొనసాగారు. 45 రోజుల తర్వాత ఆమె తన రాజీనామా సమర్పించారు. దీంతో మళ్లీ పార్టీలో పార్టీ నేత ఎన్నిక ముందుకు వచ్చింది. టోరీ పార్టీ నేతగా ఎన్నికైన వారు ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటారు.