పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో నవ దంపతులు, పిల్లలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
రిషి సునాక్ దిగ్భ్రాంతి
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బ్రిటన్ ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు అండగా ఉంటుందని సునాక్ అన్నారు. ఉగ్రవాదం ఎప్పటికీ గెలవదని, భారత్‌తో తాము ఉన్నామని ఆయన ట్వీట్ చేశారు.
ఉగ్రదాడిలో 26 మంది మృతి
మంగళవారం జరిగిన ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్‌తో ఉన్న సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు, అటారీ సరిహద్దును మూసివేయాలని నిర్ణయించారు.
కాగా ఉగ్రదాడి నేపథ్యంలో గురువారం కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ దాడిపై వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరించనున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
