భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ మధ్య రెండు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారతీయ రూపాయి, యూఏఈ దిర్హామ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి లోకల్ కరెన్సీ సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంపై అవగాహనా ఒప్పందాలు వున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా కీలక ప్రకటన వెలువడింది. సరిహద్దు లావాదేవీలు, ఇంటర్ లింకింగ్ వ్యవహారాల్లో సహకారం కోసం మన రూపాయి, యూఏఈ కరెన్సీ దిర్హామ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ మధ్య రెండు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాలపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సీఎన్‌యూఏఈ గవర్నర్ ఖలీద్ మహమ్మద్ బాలమా సంతకాలు చేశారు. అబుదాబీలో ప్రధాని మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో ఇద్దరు గవర్నర్లు ఎంవోయూలను మార్చుకున్నారు.
దీనిపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత్-యూఏఈ సహకారానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన అంశమన్నారు. మెరుగైన ఆర్ధిక సహకారానికి ఇది మార్గం సుగమం చేస్తుందని.. పరస్పర అంతర్జాతీయ ఆర్ధిక చర్యలను సులభతరం చేస్తుందని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. అటు ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం.. ద్వైపాక్షికంగా భారతీయ రూపాయి, యూఏఈ దిర్హామ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి లోకల్ కరెన్సీ సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంపై అవగాహనా ఒప్పందాలు వున్నాయి.
కరెన్సీ వ్యవస్థ అమల్లో వున్నందున.. ఎగుమతిదారులు, దిగుమతిదారులు వారి సొంత దేశీయ కరెన్సీలలో ఇన్‌వాయిస్‌తో పాటు చెల్లింపులు చేయగలరు. ఇది రూపాయి - దిర్హామ్ మార్పిడి మార్కెట్ అభివృద్ధికి సహాయపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది రెండు దేశాల మధ్య పెట్టుబడులు, రెమిటెన్స్‌లను ప్రోత్సహించడంలోనూ సహాయపడుతుంది. స్థానిక కరెన్సీల వినియోగం యూఏఈలో నివసిస్తున్న భారతీయుల చెల్లింపులతో సహా లావాదేవీల ఖర్చులు, సెటిల్‌మెంట్ సమయాన్ని ఆప్టిమైజ్ చేస్తుందని ఆర్‌బీఐ వెల్లడించింది.
ఆర్‌బీఐ, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ రెండూ వరుసగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), ఇన్‌స్టాంట్ పేమెంట్స్ ఫ్లాట్‌ఫాం (ఐపీపీ) , రూపే, యూఏఈస్విచ్‌లను లింక్ చేయడం, పేమెంట్స్ మెసెజింగ్ సిస్టమ్, స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ లింకింగ్‌ను అన్వేషించడంపై సహకరించేందుకు అంగీకరించాయి. యూపీఐ-ఐపీపీ అనుసంధానం ద్వారా ఏ దేశంలోనైనా ఖర్చుతో కూడిన క్రాస్ బోర్డర్ ఫండ్స్ బదిలీలను వేగంగా, సురక్షితంగా చేయడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.
కార్డ్ స్విచ్‌లను లింక్ చేయడం వల్ల దేశీయ కార్డుల పరస్పర అంగీకారం, కార్డ్ లావాదేవీల ప్రాసెసింగ్ సులభతరం అవుతుందని వివరించింది. మెసేజింగ్ సిస్టమ్‌ల అనుసంధానం దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్ధిక సందేశాలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. యూఏఈ , భారత్ మధ్య జరిగిన రెండు అవగాహనా ఒప్పందాలు అంతరాయాలు లేని, సరిహద్దు లావాదేవీలు, చెల్లింపులను సులభతరం చేయడం, ఇరు దేశాల మధ్య ఆర్ధిక సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.
