పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతోన్న శ్రీలంకలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అధ్యక్షుడు గోటబయ రాజపక్షే దేశాన్ని విడిచి పారిపోవడంతో లంకేయులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
శ్రీలంకలో ఆందోళనకారుల బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికే అధ్యక్షుడు, ప్రధాన మంత్రి ఇంటిని టార్గెట్ చేసిన జనం ఇప్పుడు.. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహేంద అభియవర్ధినే (mahinda abeywardena) ఇంటిని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంటిపై దాడికి కూడా పాల్పడినట్లు సమాచారం అందుతోంది. స్పీకర్ ఇంటిపైకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులపై కాల్పులు జరిపింది ఆర్మీ. స్పీకర్ అభియవర్ధినే ఇంటి వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురి పరిస్ధితి విషమంగా వున్నట్లు ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
కాగా.. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స (gotabaya rajapaksa) దేశం విడిచి పరారు కావడంతో అక్కడి ప్రజలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. ఒక్కసారిగా వేలాది మంది ప్రజలు రాజధాని కొలంబో రోడ్ల మీదకు రావడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నిరసనకారులను అదుపు చేసేందుకు సైనిక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కొలంబోలోని శ్రీలంక ప్రధాని నివాసంలోకి వెళ్లేందుకు గోడను ఎక్కిన నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనిక సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
ALso Read:Sri Lanka Crisis: శాంతిభద్రతల పునరుద్ధరించండి... సైన్యం, పోలీసులకు విక్రమ సింఘే సంచలన ఆదేశాలు
మరోవైపు అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన తర్వాత శ్రీలంక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఉటంకిస్తూ AFP వార్త సంస్థ రిపోర్ట్ చేసింది. ఇదిలా ఉంటే శ్రీలంకలోని నిరసనకారులు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించి తీరుతామని చెబుతున్నారు.
ఇక, శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే (ranil wickremesinghe) నేడు బాధ్యతలు చేపట్టారు. నిరసనకారులు ప్రధాన మంత్రి కార్యాలయంలోకి ప్రవేశించడం, దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పడంతో విక్రమ సింఘే సంచలన ఆదేశాలు జారీచేశారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీలంక మిలటరీ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. నిరసనకారులను అరెస్ట్ చేయాలని చెప్పారు.
