శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కొలంబోలో రోడ్లపైకి చేరుకున్న వేలాది మంది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కొలంబోలో రోడ్లపైకి చేరుకున్న వేలాది మంది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంకలో ఆందోళన ఉగ్రరూపం దాల్చుతున్నాయి. శ్రీలంక ప్రధాన మంత్రి కార్యాలయంలోకి ప్రవేశించిన నిరసనకారులు.. కార్యాలయ భవనంపై జెండాను ఎగరవేశారు. దీంతో నిరసనకారులను అదుపుచేయడానికి.. సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. నిరసనకారులు వెనక్కి తగ్గడానికి నిరాకరించడంతో కొలంబోలో టియర్ గ్యాస్ షెల్లింగ్ కొనసాగుతోంది.
మరోవైపు గోటబయ దేశం విడిచి మాల్దీవులకు పారిపోవడంతో.. దేశంలో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇక, శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే నేడు బాధ్యతలు చేపట్టారు. నిరసనకారులు ప్రధాన మంత్రి కార్యాలయంలో ప్రవేశించడం, దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పడంతో విక్రమ సింఘే సంచలన ఆదేశాలు జారీచేశారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీలంక మిలటరీ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. నిరసనకారులను అరెస్ట్ చేయాలని చెప్పారు. మరోవైపు పెరుగుతున్న నిరసనలను అదుపు చేసేందుకు కొలంబోతో సహా పశ్చిమ ప్రావిన్స్‌లో నిరవధిక కర్ఫ్యూ విధించబడింది.
అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఇచ్చిన హామీ మేరకు ఆయన ఈరోజు పంపుతారని పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన తెలిపారు. దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని విక్రమసింఘే నియమితులయ్యారని కూడా చెప్పారు.
ఇక, నిరసనకారులు ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపవాహిని కార్పొరేషన్ టీవీ స్టేషన్‌లోకి ప్రవేశించారు. దీంతో రూపవాహిని కార్పొరేషన్ దాని టీవీ ప్రసారాన్ని కొంతకాలం నిలిపివేసింది. కొంతసేపటి తర్వాత ఛానెల్ ప్రసారాన్ని పునఃప్రారంభించింది.అయితే నిరసనకారులు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించి తీరుతామని చెబుతున్నారు.
ఓ నిరసనకారుడు ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు గోటబయ రాజీనామా కోసం ఎదురు చూస్తున్నాం. మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. ఈరోజు గోటబయ కచ్చితంగా రాజీనామా చేయాలి. లేకుంటే ఈ నిరసన ఆగదు. నిరసన నేటితో 96వ రోజుకు చేరింది. ఇంటికి వెళ్లడానికి పెట్రోలు దొరక్క ఇక్కడే ఉండిపోయాం. ఇక్కడే తింటున్నాం, నిద్రపోతున్నాం. మూడు నెలలుగా మా పేరెంట్స్‌ను చూడలేదు. వారు ఇక్కడికి దూరంగా ఉన్నారు. మా దేశంలోనే ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. మా దేశం కావాలి. ఆయన (గోటబయ) రాజీనామా చేయకపోతే.. మేము పార్లమెంటుకు వెళ్లి దానిని కూడా ఆక్రమిస్తాం’’ అని చెప్పారు.
