బిమ్స్ టెక్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ బంధాలు బలపడాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం (russian ukraine war) నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలపై (international law) ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన శ్రీలంక అధ్యక్షతన నిర్వహించిన బిమ్స్ టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్) సదస్సులో (BIMSTEC Summit) వర్చువల్‌గా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో యూరప్‌లో జరుగుతున్న కొన్ని సంఘటనలు అంతర్జాతీయ చట్టాల స్థిరత్వం, పరిధిని ప్రశ్నిస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ బంధాలు బలపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 1997లో కలిసి లక్ష్యాలను అధిగమించినట్టే.. ఇప్పుడూ బిమ్స్ టెక్ దేశాలూ కలిసి ముందుకు సాగాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాని పేర్కొన్నారు. అనుసంధానత, సౌభాగ్యత, భద్రతను పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. బిమ్స్ టెక్ గ్రూప్ నిర్మాణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఓ చార్టర్ ను తీసుకొస్తున్నామని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇదే సమయంలో నలంద అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అందిస్తున్న బిమ్స్ టెక్ స్కాలర్ షిప్ ను (bimstec scholarship) పొడిగిస్తున్నామని ప్రధాని తెలిపారు. బిమ్స్ టెక్ నిర్వహణ ఖర్చులకు గానూ 10 లక్షల డాలర్లను ఇస్తున్నట్టు మోడీ ప్రకటించారు. కాగా, బిమ్స్ టెక్ గ్రూప్‌లో భారత్, శ్రీలంకతో పాటు మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, నేపాల్, భూటాన్‌లు సభ్యులుగా వున్నాయి.
మరోవైపు.. గత నెల రోజులుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య సాగిన భీకర పోరుకు ముగింపు పడనుంది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు (ukraine russia peace talks) విజయవంతమయ్యాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాల్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది. మంగళవారం.. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణ దిశగా పురోగతి సాధించామని ఉక్రెయిన్ ప్రతినిధి చెప్పారు. రెండు దేశాల అధ్యక్షుల మధ్య శాంతి చర్చలకు అవసరమైన వాతావరణం మార్గం సుగమమైందన్నారు.
ఈ చర్చల్లో ప్రధానంగా.. ఉక్రెయిన్ భద్రతకు అంతర్జాతీయంగా హామీ కావాలని ఉక్రెయిన్ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తదనుగుణంగా కీవ్‌తోపాటు చెర్నీహివ్ నగరాలు ఇతర ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరిస్తామని రష్యా ప్రకటించింది. ఉక్రేనియన్ దళాలు కీలకమైన కైవ్ శివారు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయనీ, దేశ రాజధాని ఉక్రెయిన్ సబర్బన్ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉక్రెయిన్ సేనలు.. మరియాపోల్‌పై నియంత్రణ కోసం పోరాడుతున్నాయి. రష్యా నియంత్రణ నుండి రాజధాని వాయువ్యానికి కీలకమైన గేట్‌వేని స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ అంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి డెనీస్ మొనాస్టైర్‌స్కై చెప్పారు.
