ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) అప్లికేషన్స్ మనిషి జీవితంలో ఓ భాగమైపోయాయి. తమ జీవితంలో జరిగే విషయాలను, అభిప్రాయాలను ఈ మాధ్యమాల వ్యక్తపరచడంతో పాటుగా, ఇతరుల అభిప్రాయాలను వారి జీవితాల్లో జరిగే విషయాలను కూడా ఈ మాధ్యమాల సాయంతో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.. సమాజంలో జరిగే అంశాలు, వార్తలు, వాణిజ్యం, సరదా, వినోదం వంటి అనేక విషయాలను ఈ మాధ్యమాలు అందిస్తున్నాయి.

అయితే, చాలా దేశాలలో ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సేవలు ఉచితంగా లభిస్తాయి. కేవలం ఇంటర్నెట్ ప్యాకేజ్ ఉంటే సరిపోతుంది. కానీ ఆ దేశంలో మాత్రం ఈ అప్లికేషన్స్‌ను ఉపయోగించాలంటే ఖచ్చితంగా పన్ను (టాక్స్) కట్టి తీరాల్సిందే. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు కూడా తయారు చేశారు. ఈ సామాజిక మాధ్యమాలు సమయాన్ని వృధా చేసేవి మాత్రమే అనేది ఉగాండా సర్కారు అభిప్రాయం. అందుకే వాటిపై పన్నులను విధించింది.

ఉగాండాలో సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై పన్ను విధిస్తున్నట్లు యుగాండ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉగాండా అధ్యక్షుడు యోవెరీ ముసెవనికీ ఓ కొత్త చట్టాన్ని కూడా రూపొందించారు. ఇలాంటి యాప్స్ వలన యువత గంటల తరబడి సోషల్ మీడియాలో తమ సమయాన్ని వృధా చేస్తోందని, ఫలితంగా ఉత్పాదకత తగ్గడమే కాకుండా అనవసరమైన పుకార్లు వ్యాపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వాయిస్, మెసేజింగ్ సేవలు ఉపయోగించే వారు రోజుకు 0.05 డాలర్లు పన్ను కట్టాలి. ఉగాండాలో ఇప్పటికే ప్రతికే ఐదు మందిలో ఒకరు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి తాజా నిర్ణయం ఆ దేశ ప్రజలపై మరింత భారాన్ని మోపనుంది. భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించేలా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి ఉగాండా వాసులు వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కానీ సర్కారు వాదన మాత్రం మరోలా ఉంది. ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై పన్ను విధించడం వలన ప్రభుత్వానికి 100 మిలియన్ డాలర్ల వరకూ ఆదాయం వస్తుందని, ఈ ఆదాయాన్ని తిరిగి ప్రజల శ్రేయస్సు కోసమే ఉపయోగించవచ్చని చెబుతోంది. అంతేకాకుండా.. ఇలా చేయటం వలన యువత సోషల్ మీడియాకు బానిసలు కాకుండా నివారించడం కూడా సాధ్యమవుతుందని అంటోంది.