పాకిస్తాన్‌లో జంట పేలుళ్ల ఘటన వెనుక భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ హస్తం ఉన్నదని ఆ దేశ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ను శుక్రవారం రెండు జంట ఆత్మాహుతిదాడులు వణికించాయి. ఈ రెండు దుర్ఘటనల్లో 65 మంది దుర్మరణం చెందారు. బలోచిస్తాన్ మస్తుంగ్ జిల్లాలో ప్రవక్త మొహమ్మద్ జయంతిని పురస్కరించుకుని ఊరేగింపునకు సిద్ధం అయ్యారు. అక్కడికి ఓ పోలీసు వాహనం వచ్చింది. ఆ పోలీసు వాహనం వద్దే ఆత్మాహుతిదాడి జరిగింది. కొన్ని గంటల తేడాతో ఖైబర్ పక్తుంఖ్వాలో హంగు నగరంలో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం ఐదుగురు మరణించారు. ఈ ఘటనపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సర్ఫరాజ్ బుగ్తి భారత్ పై ఆరోపణలు చేశారు.
బలోచిస్తాన్ రాజధాని క్వెట్టాలో ఆయన మాట్లాడుతూ, ఈ ఆత్మాహుతి దాడి వెనుక భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ హస్తం ఉన్నదని ఆరోపించారు. మస్తుంగ్ ఆత్మాహుతి దాడిలో ప్రమేయం ఉన్న శక్తులపై చర్యలకు సివిల్, మిలిటరీ, ఇతర వ్యవస్థలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని వివరించారు. ఈ ఆత్మాహుతి దాడిలో భారత నిఘా సంస్థ రా ప్రమేయం ఉన్నదని అన్నారు.
ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాద డీఎన్ఏ విశ్లేషణ చేస్తున్నామని పోలీసులు శనివారం తెలిపారు. బలోచిస్తాన్‌లో మదీనా మసీదు దగ్గర పేలుడు జరగ్గా, హంగు నగరంలో పోలీసు స్టేషన్‌కు చెందిన మసీదు లక్ష్యంగా పేలుడు చోటుచేసుకుంది.
Also Read: టర్కీ పార్లమెంటు వద్ద సమావేశాలు ప్రారంభానికి ముందు ఆత్మాహుతిదాడి, కాల్పులు.. ‘ఇది ఉగ్రదాడే’
పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ స్టేట్‌మెంటను డాన్ పత్రిక రిపోర్ట్ చేసింది. గుర్తు తెలియని దుండగులపై కేసు ఫైల్ అయినట్టు వివరించింది. ‘ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా తమే చేశామని ప్రకటించలేదు. పాకిస్తాన్‌లో చాలా చోట్ల దాడులకు పాల్పడుతున్న తెహ్రీక్ ఇ తాలిబాన్ కూడా ఈ పేలుడులో తమ జోక్యం లేదని పేర్కొన్నట్టు ఆ రిపోర్ట్ తెలిపింది.
