Pakistan Train Hijack పాకిస్తాన్ రైలు హైజాక్: టెర్రరిస్టులు మటాష్..!
పాకిస్తాన్ భద్రతా దళాలు బలూచిస్తాన్లోని బోలన్ పాస్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది పిల్లలతో సహా 104 మంది బందీలను రక్షించాయి. ఈ ఆపరేషన్లో 16 మంది టెర్రరిస్టులు హతమయ్యారు, చాలా మంది గాయపడ్డారు.

బలూచిస్తాన్లోని బోలన్ పాస్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ భద్రతా దళాలు 104 మంది బందీలను రక్షించాయని ARY న్యూస్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ నివేదించింది. రైలుపై దాడి తర్వాత వందలాది మంది రైలు ప్రయాణికులను టెర్రరిస్టులు బందీలుగా చేసుకున్నారు. భద్రతా వర్గాల ప్రకారం, భద్రతా దళాలు టెర్రరిస్టుల చెర నుండి 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది పిల్లలతో సహా 104 మంది బందీలను రక్షించాయి. 16 మంది టెర్రరిస్టులు హతమయ్యారని, చాలా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. భద్రతాధికారుల ప్రకారం, ఈ ఆపరేషన్లో టెర్రరిస్టులు భారీగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో దాదాపు 17 మంది గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదనపు భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ఆపరేషన్లో పాల్గొంటున్నారని ARY న్యూస్ నివేదిక తెలిపింది.
క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై టెర్రరిస్టుల గుంపు దాడి చేసింది, బలూచిస్తాన్లోని బోలన్ పాస్లో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. టెర్రరిస్టులు రైలును ఒక సొరంగంలో ఆపి, మహిళలు, పిల్లలతో సహా ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు.
ఈ ప్రాంతం చేరడం చాలా కష్టతరంగా భావిస్తారు. అయితే బందీలను రక్షించడానికి భద్రతా దళాలు ఒక క్లియరెన్స్ ఆపరేషన్ను ప్రారంభించాయి. టెర్రరిస్టులను దళాలు ఒక్కసారిగా ఉగ్రవాదులను చుట్టుముట్టాయి, కాల్పులు కొనసాగించాయి. ఆ సమయంలో టెర్రరిస్టులు మహిళలు, పిల్లలను మానవ కవచాలుగా ఉపయోగించారు. అయినా భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులను చంపేశాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల నుండి వైమానిక దాడులు చేశాయి. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు సమాచారం. ఈ వైమానిక దాడులను వెంటనే నిలిపివేయకపోతే, రాబోయే గంటలో 100+ మంది బందీలను చంపేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించారు. ఇంతకుముందు నవంబర్లో, క్వెట్టా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాంపై జరిగిన పేలుడులో మహిళలు, పిల్లలతో సహా కనీసం 26 మంది మరణించారు, 40 మందికి పైగా గాయపడ్డారు.

