Asianet News TeluguAsianet News Telugu

నేరస్తులతో చర్చలు జరుపుతారా?.. ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం..

2014లో పాకిస్తాన్‌లోని పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై తెహ్రీక్-ఏ-తాలిబాన్ (టీటీపీ) ఉగ్రవాదులు దాడి (terror attack) చేయడంతో 147 మంది మరణించారు. వారిలో 132 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై (Imran Khan) ఆ దేశ సుప్రీం కోర్టు (Pakistan Supreme Court) ముందు విచారణకు హాజరయ్యారు.
 

Pakistan Supreme Court questions PM Imran Khan over 2014 army school terror attack
Author
Islamabad, First Published Nov 11, 2021, 9:51 AM IST

ఓ కేసు విచారణ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై (Imran Khan) ఆ దేశ  సుప్రీం కోర్టు (Pakistan Supreme Court) ప్రశ్నల వర్షం కురిపించింది. గతంలో తామిచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరాలు.. 2014లో పాకిస్తాన్‌లోని పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై తెహ్రీక్-ఏ-తాలిబాన్ (TTP) ఉగ్రవాదులు దాడి చేయడంతో 147 మంది మరణించారు. వారిలో 132 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఇన్నేళ్లు గడిచిన ఉగ్రవాదులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఉగ్రదాడిలో మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మరోవైపు దాడికి పాల్పడిన టీటీపీ ఉగ్రమూకలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ సాగుతుంది.

పాకిస్తాన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తుంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేరుగా కోర్టుకు రావాలని ఇటీవల సమన్లు జారీ చేసింది. దీంతో బుధవారం ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం.. ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. గత ఏడాది కోర్టుకు సమర్పించిన ప్రత్యేక కమిషన్‌ విచారణలో భద్రతా వైఫల్యమే కారణమని నివేదించిన తర్వాత తీసుకున్న చర్యల గురించి కోర్టు ప్రధాని Imran Khan ప్రశ్నించింది

Also raed: Malala Yousafzahi: నోబెల్ బహుమతి గ్రహీత మలాలా ఇంట మోగిన పెళ్లి బాజా..

ఈ దాడిలో ప్రమేయం ఉన్న స్కూల్ సెక్యూరిటీ అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని ధర్మాసనం.. ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రశ్నించింది. అయితే దీనికి దాడి జరిగిన సమయంలో తాను ప్రధానిగా లేనని ఇమ్రాన్ సమాధానం ఇచ్చారు. అయితే మూడేళ్లుగా మీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధితులను ఏ విధమైన న్యాయం చేసిందని ధర్మాసనం ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశ్నించింది. అధికారంలో ఉన్న మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగింది. దీనికి ఇమ్రాన్ ఖాన్ బదులిస్తూ.. తాము బాధిత కుటుంబాలను పరిహారం అందజేసినట్టుగా తెలిపారు. అయితే దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. బాధిత కుటుంబాలు కోరుకుంటుంది పరిహారం కాదని.. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వం సీరియస్‌ అయింది. 

పెషావర్ ఉగ్రదాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్మీ అధికారులపై కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ‘మీరు అధికారంలో ఉన్నారు. ప్రభుత్వం కూడా మీదే. మీరు ఏమి చేసారు? నేరస్తులతో ఎందుకు చర్చలు జరుపుతున్నారు..?’అని చీఫ్ జస్టిస్ అహ్మద్.. ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశ్నించారు. ఇక, 2012 తర్వాత పాక్ దేశ ప్రధాని సుప్రీం కోర్టు ముందు హాజరుకావడం ఇదే తొలిసారి. 2012లో అప్పటి ప్రధాని రాజా పర్వేజ్ అష్రఫ్ ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios