సమయం దొరికినప్పుడల్లా భారత్‌ పరువు తీయడానికి పాకిస్తాన్, పాక్ జాతీయులు ప్రయత్నిస్తూనే వుంటారు. తాజాగా మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ  చేసిన వ్యాఖ్యలను కూడా పాకిస్తాన్ తమకు అనుకూలంగా మలచుకుంది. 

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చేసిన వ్యవహారం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారి తీసింది. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ వ్యవహరాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు పాకిస్తాన్ అందివచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. ముఖ్యంగా భారత్ పరువు తీసేందుకు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతోంది. 

డిజిటల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సెంటర్ (డీఎఫ్ఆర్ఏసీ) నివేదిక ప్రకారం.. సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ట్వీట్లను పోస్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ జాతీయులేనని తేలింది. 60 వేలకు పైగా వినియోగదారుల ఖాతాలను, పోస్ట్‌లను విశ్లేషించగా.. వారిలో ఎక్కువ మంది నుపుర్ శర్మ వ్యవహారానికి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ 60 వేలు కూడా వివిధ దేశాలకు చెందిన ధృవీకరించబడని ఖాతాలేనని... వీరిలో పాకిస్తాన్‌కు చెందిన వారే 7,100 మంది వున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 

డీఎఫ్ఆర్ఏసీ ప్రకారం.. ఒమన్ గ్రాండ్ ముఫ్తీ భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిందని పాకిస్తానీయులు తప్పుడు వార్తలను వ్యాప్తి చేశారు. అలాగే బహిష్కరణకు గురైన బీజేపీ నేత నవీన్ జిందాల్ పారిశ్రామికవేత్త జిందాల్‌కు సోదరుడంటూ.. పాకిస్తాన్ మాజీ రాయబారి అబ్దుల్ తప్పుడు వాదనలు చేశారు. అంతేకాకుండా ఇంగ్లీష్ క్రికెటర్ మొయిన్ అలీ పేరుతో ఐపీఎల్‌ను బహిష్కరిస్తున్నట్లుగా వున్న నకిలీ స్క్రీన్ షాట్ కూడా వైరల్‌గా మారింది. 

#Stopinsulting_ProphetMuhammad, #boycottindianproduct హ్యాష్‌ట్యాగ్‌లను ఎక్కువ మంది వినియోగించారు. ఇండోనేషియా, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, మాల్దీవులు, ఒమన్, ఆఫ్ఘనిస్తాన్, కువైట్, ఖతార్, ఇరాన్‌ సహా పలు దేశాలు మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అయితే నుపుర్‌పై భారత ప్రభుత్వ చర్యలతో ఇరాన్, అలాగే ఖతార్ కూడా సంతృప్తి చెందాయి. అయితే ఖాలీద్ బేడౌన్, మొయినుద్దీన్ ఇబ్న్ నస్రుల్లా, అలీ సోహ్రాబ్ వంటి ద్వేషపూరితవాదులకు భారత్‌లో ద్వేషం, మతతత్వాన్ని వ్యాప్తి చేయడానికి ఈ ఘటనతో మరొక అవకాశం లభించినట్లయ్యింది. #BoycottIndianProduct అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌లను పోస్ట్ చేసిన బేడౌన్ కాశ్మీర్ సమస్యను ఇందులోకి లాగారు.