పాక్ ఎన్నికల్లో మాదే విజయం: సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ వీడియో
పాకిస్తాన్ లో తమ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సార్వత్రిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ- ఇన్సాప్ (పీటీఐ) మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. లండన్ ప్లాన్ ఫెయిలైందని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగానికి చెందిన వీడియోను పోస్టు చేశారు.
also read:ప్రాణాపాయంలో వ్యక్తి: రైలును తోసిన ప్రయాణీకులు
నా ప్రియమైన దేశ ప్రజలారా అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి పునాది వేశారన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించేందుకు సహయపడినందుకు అభినందిస్తున్నట్టుగా ఆయన ఎక్స్ లో వీడియో పోస్టు చేశారు.
పీటీఐ మద్దతు గల అభ్యర్థులు 170 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తున్నారన్నారు. మూడింట రెండు వంతుల మెజారిటీ లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన ప్రత్యర్ధి నవాజ్ షరీఫ్ పై ఆయన విమర్శలు చేశారు. లండన్ ఫ్లాన్ విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
also read:ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్
నిబంధనలకు విరుద్దంగా ఎన్నికల్లో కొందరు వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితిని ఎవరూ కూడ అంగీకరించబోరన్నారు. అంతర్జాతీయ మీడియా కూడ దీని గురించి విస్తృతంగా నివేదించిందన్నారు. పాకిస్తాన్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని నవాజ్ షరీఫ్ కూడ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.గత ఏడాది ఆగస్టు నుండి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నారు. ప్రభుత్వ రహస్యాలు, అక్రమార్జన , చట్టవిరుద్దమైన వివాహాలకు సంబంధించిన కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ దోషిగా జైలుకు వెళ్లాడు.
గురువారం నాడు జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ కి చెందిన ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.శుక్రవారం నాడు అర్థరాత్రి 12 గంటల వరకు 245 నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు 98 సీట్లు, పీఎంఎల్-ఎన్ 69, బిలావల్ భుట్టో-జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 51 స్థానాల్లో విజయం సాధించింది.
also read:మమ్మల్ని సజీవ దహనం చేసే ప్రయత్నం: ఉత్తరాఖండ్ హల్ద్వానీ ఘటనలో గాయపడిన మహిళ పోలీస్ అధికారి
పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలను పెంపొందించుకుంటూ దేశాన్ని సుసంపన్నం వైపు నడిపించాలని కోరుకుంటున్నట్టుగా నవాజ్ షరీఫ్ తెలిపారు. పాకిస్తాన్ లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం పీపీపీకి చెందిన ఆసిఫ్ అలీ జర్ధారీ, జేయుఐ-ఎఫ్ కి చెందిన ఫజ్లుర్ రెహ్మాన్ , ఎంక్యూఎం-పికి చెందిన ఖలీద్ మక్బూల్ సిద్దిఖీలను సంప్రదించాలని తన సోదరుడు సెహబాజ్ కు చెప్పానని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.