ఇస్లామాబాద్‌ : ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై విరుచుకుపడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అవి సఫలీకృతం కాకపోవడంతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. 

కశ్మీరీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కశ్మీరీలకు మద్దతుగా పీఓకేలోని ముజఫరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీరీలు ఆయుధాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భారత్ పై పోరాటం చేయాలని సూచించారు. ప్రపంచానికి తాను కశ్మీర్‌ రాయబారిగా వ్యవహరిస్తూ వారికి బాసటగా నిలుస్తానని ఇమ్రాన్ ఖాన్ హామీ ఇచ్చారు. 

ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తాను కశ్మీరీలను నిరాశపరచనని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ సమస్య మానవతా సంక్షోభమని అభిప్రాయపడ్డారు. ఐరోపా యూనియన్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌లు సైతం కశ్మీర్‌ అంశాన్ని చర్చించినట్లు చెప్పుకొచ్చారు. 

కశ్మీర్‌లో భారత సేనలు హింసకు తెగబడితే ఎలాంటి ఫలితం ఉండదంటూ ప్రధాని మోదీకి స్పష్టం చేశారు. భారత్‌ ఎలాంటి దుందుడుకు వైఖరి ప్రదర్శించినా తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. 

కశ్మీర్‌ ప్రజలు భారత్‌ను వ్యతిరేకించాలని కోరారు. బీజేపీ-ఆరెస్సెస్‌ నేతృత్వంలోని భారత్  ప్రభుత్వంపై ఆయుధాలతో తిరగబడాలని కోరారు. అమాయక కశ్మీరీల సహనాన్ని ప్రధాని మోదీ పరీక్షిస్తున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.  

భారత దళాల అణిచివేతకు 20 సంవత్సరాల కశ్మీర్‌ యువకుడు ఆగ్రహంతో రగిలిపోయాడని చెప్పుకొచ్చారు. తన శరీరానికి బాంబులు అమర్చుకుని పుల్వామాలో సైన్యంపై దాడికి దిగాడని గుర్తు చేశారు. పుల్వామా దాడికి భారత్‌ పాకిస్తాన్‌ను నిందిస్తూ బాలాకోట్‌లో వైమానిక దాడులకు దిగిందని గుర్తు చేశారు. 

భారత విమానాన్ని తాము కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు. భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను తిరిగి భారత్ కు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్తాన్ యుద్ధం కోరుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. 

అయితే అంతర్జాతీయ ఒత్తిళ్లకు పాక్ తలొగ్గిందని మోదీ భారత్ ప్రజలకు చెప్పుకున్నారని విమర్శించారు. నిజమైన భారతీయుడు ఎప్పుడూ మృత్యువుకు భయపడరన్న విషయం మోదీకి తెలియదా అంటూ నిలదీశారు ఇమ్రాన్ ఖాన్. 

ఈ వార్తలు కూడా చదవండి

భారత్ నే నమ్ముతున్నారు... కశ్మీర్ పై పాక్ మంత్రి కామెంట్స్

మరో కుట్రకు పాక్ ప్లాన్... మసూద్ అజార్ విడుదల

భారత్ తో యుద్ధం.. సంచలన ప్రకటన చేసిన పాక్ ప్రధాని

మేం యుద్ధం చేస్తే ప్రపంచానికే నష్టం: ఇమ్రాన్ ఖాన్