భారత్ పై మరో ఉగ్రదాడికి పాక్ ప్లాన్ చేస్తోందా..? అవుననే అనుమానాలే కలుగుతున్నాయి. భారత్ పై దాడిచేసేందుకు పాక్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజాద్‌ను జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. 

ఈ నేపథ్యంలో భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పంజాబ్‌, రాజస్తాన్‌, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది. భారత్‌పై ప్రతీకార చర్యలకు ఎప్పటి నుంచో కాలుదువ్వుతున్న పాక్‌.. అజార్‌ను విడుదల చేసి ఈ చర్యకు పాల్పడేందుకు వ్యూహాలు రచించినట్లు ఐబీ అనుమానం వ్యక్త చేస్తోంది.

భారత్ పై దాడికి పాల్పడేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేయడానికి రెండు రోజుల క్రితం మసూద్ ను రసహ్యంగా విడుదల చేసినట్లు ఇంటిలిజెన్స్ రిపోర్టు అందింది. కాగా అజాద్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్‌పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ సమాజం ముందు నటిస్తూనే పాక్‌ ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది.

ఇటీవల భారత ప్రభుత్వం కశ్మీర్ కి ఉన్న స్వయంప్రతిపత్తిని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్ ని దోషి గా నిలబెట్టాలని ప్రయత్నించి పాక్ ప్రపంచ దేశాల ముందు పరువు పొగొట్టుకుంది. ఈ క్రమంలో భంగపాటుకు గురైన పాక్... భారత్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలని చూస్తోంది.