ఇస్లామాబాద్:  అణ్వస్రాలు కలిగి ఉన్న భారత్, పాకిస్తాన్ లు యుద్దం చేస్తే దాని పర్యవసనాలు ప్రపంచం మొత్తం ఎదుర్కోవాల్సి వస్తోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

కాశ్మీర్ అవర్ పేరుతో శుక్రవారం నాడు పాకిస్తాన్ సెక్రటేరియట్ ఎదుట  నిర్వహించిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.కాశ్మీర ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహించారు.

భారత్  పీఓకేపై ఏదైనా మిలటరీ చర్యకు ఉపక్రమిస్తే దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తమ సాయుధ బలగాలు ఎలాంటి చర్యకైనా సిద్దంగా ఉన్నాయన్నారు.కాశ్మీర్ లో ముస్లింలు పీడనకు గురౌతోంటే అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉంటుందని విమర్శించారు.

కాశ్మీర్ లో ఏం జరుగుతోందో ప్రపంచమంతా చూస్తోంది... అక్కడి ప్రజలు ముస్లింలు కాకపోయి ఉంటే ప్రపంచం మొత్తం వారికి అండగా ఉండేదని  ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు.జమ్మూ కాశ్మీర్  రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దు చేయడం పై  పాక్ తీవ్రంగా తప్పుబడుతోంది.అంతర్జాతీయ సమాజాన్ని ఈ విషయంలో పాక్  కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ, ఏ ఒక్క దేశం కూడ పాక్‌కు అండగా నిలవలేదు.