కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ కి మింగుడుపడటం లేదన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల ముందు భారత్ ని దోషిగా నిలబెడదామని పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒక్క దేశం కూడా పాక్ కి మద్దతుగా నిలబడలేదు. దీంతో అవమానాల పాలైన ఇమ్రాన్.. భారత్‌తో యుద్ధం రావొచ్చంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఆయన ఒక్కరే కాదు, ఆ దేశ మంత్రులు, మిలటరీ అధికారులు కూడా యుద్ధ కాంక్షతో రగిలిపోయారు.
 
ఇన్నాళ్లూ తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలను చూసి భారత్‌ను పాక్ భయపెట్టే ప్రయత్నం చేసింది. అయితే, తాజాగా సోమవారం ఇమ్రాన్ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధం అనేది వస్తే.. తాము తొలుత అణ్వస్త్రాలను ప్రయోగించబోమని పేర్కొన్నారు. భారత్-పాక్‌లు రెండూ అణ్వస్త్ర దేశాలేనన్న ఇమ్రాన్.. రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు మరింత పెరిగితే అది ప్రపంచానికే ప్రమాదకరమన్నారు. లాహోర్‌లోని సిక్కు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలే అయినప్పటికీ తాము తొలుత అణ్వస్త్రాన్ని ఉపయోగించబోమని స్పష్టం చేశారు.