bomb blast in Pakistan: పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్‌లో శాంతి సమావేశంలో బాంబ్ బ్లాస్ట్ జ‌రిగింది. ఈ పేలుడులో 7 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.  

Bomb blast in Pakistan:  భార‌త్ తో ఉద్రిక్త‌ల న‌డుమ  పాకిస్తాన్ లో వ‌రుస‌గా బాంబ్ బ్లాస్ట్ ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. ఉగ్ర‌వాదుల‌ను పెంచిపోషిస్తున్న పాక్ ఇప్పుడు వారితోనే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటోంది. 

దక్షిణ వజీరిస్తాన్ జిల్లా ప్రధాన కార్యాలయం అయిన వానాలోని స్థానిక శాంతి కమిటీ కార్యాలయంలో బాంబు పేలుడు సంభవించింది. 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువ‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ భారీ పేలుడుతో భవనంలోని ఒక భాగం కూలిపోయింది, అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని శాంతి కమిటీ కార్యాలయంపై జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో 7 మంది మ‌ర‌ణాలు వెల్ల‌డైనా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా, ఇప్పటివరకు, పేలుడుకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.

రెస్క్యూ బృందాలు, స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని స‌మాచారం. పోలీసులు, భద్రతా సంస్థలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడుకు కారణమైన వారిని గుర్తించడానికి సంఘటన స్థలం నుండి ఆధారాలు సేకరిస్తున్నామనీ, వివిధ కోణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

నవంబర్ 2022లో నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్‌లో ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులలో ఉగ్రవాద సంఘటనలు పెరిగాయి.