Asianet News TeluguAsianet News Telugu

భారత రాఫేల్ యుద్ధ విమానాలకు సమాధానంగా పాకిస్తాన్ జే-10 సీ!.. చైనా నుంచి కొనుగోలు

భారత దేశం రాఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పటి నుంచి పాకిస్తాన్ కూడా అన్ని వాతావరణాల్లోనూ అత్యధిక సదుపాయాలతో సేవలు అందించే సామర్థ్యం గల యుద్ధ విమానాల కోసం అన్వేషణ ప్రారంభించింది. కొన్నాళ్లుగా పాకిస్తాన్ దగ్గర చైనా ఫైటర్ జెట్లు ఉన్నాయనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా, పాకిస్తాన్ మంత్రి ఒకరు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. భారత రాఫేల్ జెట్లకు సమాధానంగా పాకిస్తాన్ 25 జే-10సీ యుద్ధ విమానాలను చైనా నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.
 

pakistan acquisitioned j-10c fighter jets from china
Author
New Delhi, First Published Dec 30, 2021, 3:09 PM IST

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఫ్రాన్స్(France) నుంచి రాఫేల్ జెట్ల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేసినప్పటి నుంచి పాకిస్తాన్‌(Pakistan)లో కలవరం మొదలైంది. ఎలాగైనా ఆ దేశ వైమానిక దళ (Air Force) సామర్థ్యాన్ని పెంచుకోవాలని తహతహలాడుతున్నది. యుద్ధ విమానాల కోసం దాని చిరకాల మిత్రదేశం చైనాతో డీల్ కుదుర్చుకున్నట్టూ చర్చ జరిగింది. అంతేకాదు, కొన్నాళ్లుగా చైనా(China) దేశానికి చెందిన యుద్ధ విమానాలను పాకిస్తాన్ వినియోగిస్తున్నదనే వాదనలు వచ్చాయి. దీనిపై అధికారికంగా మాత్రం పాకిస్తాన్ ప్రకటించలేదు. తాజాగా, ఈ విషయమై ఓ ప్రకటన వచ్చింది. చైనా నుంచి 25 జే-10 సీ(J-10C) యుద్ధ విమానాలను కొనుగోలు చేసినట్టు పాకిస్తాన్ ధ్రువీకరించింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం దీనిపై మాట్లాడారు.

చైనా నుంచి జే-10 సీ.. 25 యుద్ధ విమానాలు పాకిస్తాన్‌కు వచ్చాయని మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. ఇవన్నీ పాకిస్తాన్ డే వేడుకలు నిర్వహించే మార్చి 23న ఫ్లై పాస్ట్‌లో పాల్గొంటాయని వివరించారు. వచ్చే ఏడాది నిర్వహించే ఈ వేడుకలకు వీఐపీ అతిథులు హాజరవుతారని చెప్పారు. అదే రోజున జే-10 సీ యుద్ధ విమానాల ఫ్లై పాస్ట్ వేడుక ఉంటుందని తెలిపారు. భారత్‌ కొనుగోలు చేసిన రాఫేల్ జెట్లకు సమాధానంగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ జే-10 సీ యుద్ధ విమానాల విన్యాసాలు ఆ రోజు చేపడుతుందని పేర్కొన్నారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అన్ని వాతావరణాల్లోనూ అద్భుతమైన సేవలు అందిస్తాయని అన్నారు. అయితే, రాఫేల్ జెట్లతో పోటీ పడే సత్తా చైనాకు చెందిన జే-10 సీ యుద్ధ విమానాలను ఉన్నదా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

Also Read: ఫిబ్రవరిలో మరో మూడు రాఫేల్ జెట్లు.. చివరి దానిపై ఎయిర్‌ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్య

గతేడాది పాకిస్తాన్, చైనాలు సంయుక్తంగా డ్రిల్ నిర్వహించాయి. ఈ ఎక్సర్‌సైజులో పాకిస్తాన్, చైనా దేశాల యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయి. గతేడాది డిసెంబర్ 7న మొదలైన డ్రిల్ 20 రోజులపాటు జరిగాయి. ఈ కార్యక్రమంలో జే-10 సీ, జే-11 బీ జెట్లు, కేజే-500 విమానాలు, వై-8 ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను చైనా పంపింది. కాగా, పాకిస్తాన్ జేఎఫ్-17, మిరేజ్-3 ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా యుద్ధ విమానాలను దగ్గరగా చూడటానికి పాకిస్తాన్‌కు ఒక అవకాశం చిక్కింది.

పాకిస్తాన్ దగ్గర అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే, ఫ్రాన్స్ నుంచి భారత దేశం రాఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచించింది. అది కూడా అన్ని రకాల సదుపాయాలు కలిగి ఉండి.. అన్ని వాతావరణాల్లోనూ దాడి, ప్రతిదాడులకు సిద్ధంగా ఉండే యుద్ధ విమానాల కోసం ప్రయాస పడింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఆప్తబంధువుగా ఉంటున్న చైనా జే-10 సీ యుద్ధ విమానాలతో ఆదుకుంది.

Also Read: ఆగని కవ్వింపులు: మరోసారి భారత భూభాగంపైకి పాక్ యుద్ధ విమానాలు

ఫ్రెంచ్ సంస్థతో ఒప్పందం కుదిరిన 36 యుద్ధ విమానాలకు గాను 32 యుద్ధ విమానాలు ఇప్పటికే భారత్‌కు వచ్చాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఇటీవలే వివరించారు. మిగిలిన నాలుగు విమానాల్లో మూడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌కు వస్తాయని తెలిపారు. కాగా, చివరి రాఫేల్ జెట్‌లో కొన్ిన మార్పులు చేర్పులు ఉంటాయని, అవి భారత్‌కు అనుకూల సౌలభ్యాలు వాటిలో ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈ మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఆ ఫ్లైట్‌పై అన్ని ట్రయల్స్ చేస్తారని, ఆ ట్రయల్స్ అన్నీ సఫలం అయ్యాక దాన్ని భారత్‌కు తీసుకు వస్తారని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios