ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ రాజీనామా...
ఎనిమిదేళ్ల క్రితం నా అపార్ట్‌మెంట్‌లో కొంతమందిమి కలిసి ఓపెన్ ఏఐని ప్రారంభించాం. అది ఒక్కొక్క మెట్టుగా ఎదిగింది. ఇప్పుడు దాన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను.
ఓపెన్ ఏఐ వ్యవహారం ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ ను తొలగించి, ఆ స్థానంలో మీరా మురాటికి తాత్కాలిక సీఈవోగా బోర్డు ప్రకటించింది. ఇది జరిగిన గంటల్లోనే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ కంపెనీకి రాజీనామా చేశారు. టెక్ పరిశ్రమలో అద్భుతాలు సృష్టించిన సామ్ ఆల్ట్‌మాన్ నిష్క్రమించిన కొద్ది గంటలకే బ్రాక్‌మాన్ సోషల్ మీడియాలో తన రాజీనామాను ప్రకటించాడు.
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌ను "బోర్డుతో అతను కమ్యూనికేషన్‌లలో నిలకడగా, నిష్కపటంగా వ్యవహరించడం లేదని" బోర్డు ఆరోపించింది. తమ సమీక్షలో ఈ విషయం తేలిందని చెప్పి బయటకు నెట్టేసింది. ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతని సామర్థ్యంపై బోర్డుకు ఇకపై విశ్వాసం లేదని కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
OpenAI New CEO Mira Murati : ఓపెన్ ఏఐ కొత్త తాత్కాలిక సీఈఓగా మీరా మురాటి.. ఇంతకీ ఆమె ఎవరంటే?
దీనిమీద వెంటనే రియాక్ట అయిన బ్రాక్ మాన్.. "8 సంవత్సరాల క్రితం నా అపార్ట్‌మెంట్‌లో దీన్ని ప్రారంభించినప్పటి నుండి మనమందరం కలిసి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాం. దాని గురించి నేను చాలా గర్వపడుతున్నాను," అని ఎక్స్ లో షేర్ చేసిన ఒక ప్రకటనలో రాసుకొచ్చాడు. కానీ ఈరోజు వచ్చిన వార్తలు నన్ను కలిచి వేశాయి. అందుకే నేను నిష్క్రమించాను. “మీ అందరికీ మంచి జరగాలని నిజంగా కోరుకుంటున్నాను. మానవాళి అందరికీ ప్రయోజనం చేకూర్చే సురక్షితమైన AGIని సృష్టించే లక్ష్యాన్ని నేను విశ్వసిస్తూనే ఉన్నాను”అన్నారాయన.
దీంతోపాటు తనను తొలగించడంపై ఆల్ట్ మన్ చేసిన పోస్టును షేర్ చేస్తూ దానికి సంబంధించి ప్రతిస్పందనగా ఈ ప్రకటన షేరు చేశాడు. అందులో ఆల్ట్ మన్ “నేను ఓపెన్ ఏఐలో గడిపిన సమయం ఎంతో ఇష్టం. అన్నింటికంటే ఎక్కువగా.. ప్రతిభావంతులైన వ్యక్తులతో కలిసి పనిచేయడం నాకు నచ్చింది" అని బోర్డు ప్రకటన తర్వాత ఆల్ట్‌మాన్ X లో పోస్ట్ చేశాడు "తర్వాత ఏమి జరుగుతుందనే దాని గురించి" మరిన్ని వివరాలను పంచుకుంటానని వాగ్దానం చేశాడు.