ఉత్తర కొరియా యుద్ధానికి సై అంటున్నట్టు తెలుస్తున్నది. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ దేశ మిలిటరీకి అలర్ట్ ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలిసింది. యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చినట్టు సమాచారం. 

న్యూఢిల్లీ: ఉత్తరకొరియా ఏం చేసినా యుద్ధ భయాలే ప్రధానంగా ఉంటాయి. క్షిపణులు ప్రయోగించడం, పరీక్షలు చేయడం వంటివే కాదు.. ప్రత్యర్థి దేశమా? అగ్ర రాజ్యమా? అనే పట్టింపు లేకుండా మాటల తూటాలు పేల్చడం కూడా ఇలాంటి భయాలనే తరుచూ రేకెత్తిస్తుంటాయి. తాజాగా, వచ్చిన వార్త ఈ భయాలను మరింత పెంచేస్తున్నాయి. ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధమవుతున్నదని ఆ వార్త ద్వారా తెలుస్తున్నది. ఇందుకోసం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ మిలిటరీకి కూడా పిలుపు ఇచ్చినట్టు సమాచారం.

యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ సైన్యాన్ని అలర్ట్ చేసినట్టు కేసీఎన్ఏ ఓ కథనంలో పేర్కొంది. యుద్ధ సన్నాహాల్లో భాగంగానే ఓ అత్యున్నత స్థాయి మిలిటరీ జనరల్‌‌ను మార్చినట్టూ తెలిసింది. అలాగే, ఆయుధ ఉత్పత్తిని పెంచాలని, సైన్య సన్నాహాలు వేగవంతం చేయాలని కిమ్ ఆదేశించారు. 

Also Read: ఆ కేసులో కోర్టుకు బర్రెను కూడా తీసుకువచ్చారు.. ఎందుకో తెలుసా?

ఉత్తర కొరియా ప్రత్యర్థి, పొరుగు దేశం దక్షిణ కొరియా, అమెరికా కలిసి ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సంయుక్తంగా మిలిటరీ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ తరుణంలోనే కిమ్ జోంగ్ ఉన్ యుద్ధానికి సిద్ధం కావాలనే పిలుపు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ప్రస్తుత మిలిటరీ జనరల్ పాక్ సూ ఇల్ స్థానంలో జనరల్ రియాంగ్‌ను నియమిస్తున్నట్టు కిమ్ ప్రకటించారు. దీంతో మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చర్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి.