న్యూఢిల్లీ: తమ గడ్డ మీది నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేసేంత వరకు పాకిస్తాన్ తో చర్చలు ఉండవని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ పట్ల భారత్ మెతక వైఖరి అవలంబిస్తోందనే మాటల్లో కూడా నిజం లేదని అన్నారు.

మోడీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై ఆమె సోమవారం వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడారు. పాకిస్తాన్ తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో కొనసాగడం కుదరదని అన్నారు. 

పాకిస్తాన్ పట్ల అనుసరిస్తున్న విధానంలో ప్రాథమికమైన మార్పేమీ లేదని సుష్మా చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్నప్పుడు, సైనికులు మరణిస్తున్నప్పుడు పాకిస్తాన్ తో మాట్లాడలేమని అన్నారు. 

ఇరాన్ పై అమెరికా విధించిన తాజా ఆంక్షలపై ప్రస్తావించినప్పుడు తాము ఐక్య రాజ్యసమితి ఆంక్షలను మాత్రమే ఆమోదిస్తామని, ఒక దేశం ప్రత్యేక విధించే ఆంక్షలను అంగీకరించబోమని అన్నారు. 

హెచ్1బీ వీసాల సమస్యపై ప్రశ్నించినప్పుడు భారతీయుల మీద ప్రభావం పడకుండా చూసేందుకు అమెరికా ప్రభుత్వంలోని, అధికార యంత్రాంగంలోని అన్ని విభాగాలతో మాట్లాడుతున్నామని చెప్పారు.