లెక్కల్లో ఆ చిన్నారికి సున్నా మార్కులు వచ్చాయి. తల్లి మాత్రం ఆమెకు మొట్టికాయలు వేయకుండా ప్రోత్సహించేలా స్పందించింది. ఈ ఫలితాలు స్వీకరించాలంటే కూడా చాలా ధైర్యం కావాలని, అది నీకు ఉన్నదని బిడ్డను ప్రోత్సహించింది. ఆ తర్వాత ఆ బిడ్డ రాణించింది. ఇప్పుడు పెరిగి పెద్దైన ఆ యువతి తన తల్లి గతంలో తన లెక్కల మార్కుల పేపర్ పై రాసిన కామెంట్లను ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇది వైరల్ అయింది.
న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి చదువులు చదవాలని, సార్థకులు కావాలని ఉబలాటపడతారు. ఈ బలమైన కోరికతో చాలా సార్లు పిల్లలపట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారు. ఇది పిల్లల్లోనూ మానసిక సమస్యలకు కారణాలవుతాయి. పిల్లలను గాడిలో పెట్టడానికే అలా మందలించడం అని తల్లిదండ్రులు చెబుతారు. కానీ, పిల్లలను సరైన మార్గంలో పెట్టాలంటే తల్లిదండ్రులు వారిపట్ల కఠినంగా వ్యవహరించాలా? ఇదే సరైన మార్గమా? తాజా వైరల్ పోస్టు ఇందుకు ‘కాదనే’ సమాధానం చెబుతున్నది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో జైనాబ్ అనే యువతి తన చిన్ననాటి మార్కుల షీట్‌ను పంచుకుంది. ఆ షీట్ పై తన తల్లి రాసిన ప్రోత్సాహక వ్యాఖ్యలను ఫొటో తీసి పోస్టు చేసింది. రూమ్‌లో తన ఆరో తరగతి లెక్కల పుస్తకం కనిపించిందని, అది తెరిచి చూస్తే అందులో తనకు 15 మార్కులకు గాను సున్నా మార్కులు వచ్చినట్టు ఉన్నదని వివరించింది. అయితే.. సున్నా మార్కులు తెచ్చుకున్నందుకు ఆ రోజు అమ్మ తనను కొట్టలేదని గుర్తు చేసుకుంది. తన మార్కులను చూసి ఆ మార్క్ షీటు పై ఓ కామెంట్ రాసింది. ‘డియర్.. ఈ మార్కులను స్వీకరించాలంటే చాలా ధైర్యం కావాలి. నీకు చాలా ధైర్యం ఉన్నది’ అని తల్లి రాసిన కామెంట్‌ను ఫొటో తీసి పంచుకుంది.
తన తల్లి ఎంతమంచిదో.. ప్రతి రోజూ తాను తన నిరాశపూరిత మార్కులను తెచ్చుకున్నా.. తల్లి మాత్రం ప్రోత్సాహకర మాటలతో తనను ముందుకు నడిపేదని ఆ యువతి తెలిపింది. తన తల్లి ప్రోత్సాహంతో తాను ఆ తర్వాత లెక్కల్లో రాణించానని వివరించింది. ‘మీ పిల్లలకు కూడా మార్కులు తక్కువ వచ్చాయని కోపగించుకోకండి. వారిని ప్రోత్సహిస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు’ అని ఆ యువతి సూచించింది.
ఈ పోస్టుపై కామెంట్లు విపరీతంగా వచ్చాయి. ఆ తల్లి ప్రోత్సాహం ఆదర్శనీయం అని, ఆమె మనసు గొప్పదని కామెంట్లు చేశారు. ఆమె సానుకూల దృక్పథాన్ని మెచ్చుకున్నారు. కొందరు మరీ ఎమోషనల్ అయిపోయారు. ఈ పోస్టు చూడగానే బాధ, సంతోషం రెండూ కలిగాయని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
