లాస్ ఏంజెలెస్‌లో వలసదారుల అరెస్టులపై ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. యాపిల్ స్టోర్‌తో పాటు పలు దుకాణాలు దోచేసిన దుండగులు.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో వలసదారుల అరెస్టులపై జరుగుతున్న నిరసనలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మొదట శాంతియుతంగా సాగిన ఆందోళనలు ఆపై హింసాత్మక రూపం దాల్చాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు డౌన్‌టౌన్ ప్రాంతంలో ఉన్న వ్యాపార కేంద్రాలపై దాడులకు దిగారు. ముఖ్యంగా యాపిల్ స్టోర్ లక్ష్యంగా మారింది.
యాపిల్ స్టోర్ లక్ష్యంగా…
ముసుగులు ధరించిన కొందరు దుండగులు స్టోర్ అద్దాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దోచుకెళ్లారు. కేవలం యాపిల్ స్టోర్ మాత్రమే కాకుండా ఇతర వ్యాపార సంస్థలు కూడా దాడికి గురయ్యాయి. వీరంతా నిరసన పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తూ వలసదారుల అరెస్టును దించిచూపించే పేరుతో దోపిడీకి పాల్పడ్డారు.
ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు చురుకైన చర్యలకు దిగారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. లాస్ ఏంజెలెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారి క్రిస్ మిల్లర్ ఈ విషయాన్ని మీడియాకు ధృవీకరించారు. దొంగతనానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
ఈ పరిస్థితులను అదుపులోకి తీసుకోవడం కోసం మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించామని లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ ప్రకటించారు. డౌన్‌టౌన్‌లోని ముఖ్య ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. వ్యాపార కేంద్రాలపై దాడులు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని ఆమె హెచ్చరించారు.
ఈ ఉద్రిక్తతలికి మూలకారణం ఐసీఈ అధికారులు వలసదారులపై చేపట్టిన సోదాలు. శుక్రవారం డౌన్‌టౌన్‌లో అక్రమంగా ఉన్న వలసదారుల కోసం శోధనలు ప్రారంభించారు. ఈ సోదాలకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు క్రమంగా శాన్ ఫ్రాన్సిస్కో, శాంతా అనా, డాలస్, ఆస్టిన్ వంటి ఇతర నగరాలకు విస్తరించాయి.
ఈ పరిస్థితుల్లో జాతీయ కార్యాలయాలు, డిటెన్షన్ కేంద్రాలకు భద్రత కల్పించేందుకు అమెరికా ప్రభుత్వం నేషనల్ గార్డ్ బలగాలను, 700 మంది మెరీన్లను పంపింది. కానీ ఈ చర్యలకు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, మేయర్ కరెన్ బాస్ సహా పలువురు అధికార ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకత తెలిపారు.
