ప్రపంచ దేశాలను వణికించడంతో పాటు ఆర్ధిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తోన్న కరోనా అంతకంతకూ వేగంగా వ్యాపిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఆయా దేశాలు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

అటు భారతదేశంలోనూ 28 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో భారతీయులు ఉలిక్కిపడుతున్నారు. ఒకరికి కరోనా వచ్చిందని నిర్థారణ కావడానికి ప్రపంచంలోని అన్ని దేశాల వద్దా సరైన సౌకర్యాలు లేవు. మనదేశంలోనూ రోగుల రక్తనమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి రిపోర్ట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

Also Read:కమాండ్ కంట్రోల్, కరోనా ఎవరికీ సోకలేదు: మంత్రి ఈటల

అయితే కరోనాను వేగంగా గుర్తించే పరీక్షలో బ్రిటన్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. న్యూకాజల్‌లోని నార్తుంబ్రియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం శ్వాస ద్వారా కరోనాను గుర్తించే బయో మీటర్‌ను కనుగొన్నారు.

ప్రస్తుతం లాలాజలాన్ని పరీక్షించి కోవిడ్-19ను గుర్తిస్తున్నారు. అయితే దీనికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. అయితే లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త విధానం ద్వారా కొన్ని క్షణాల్లోనే వైరస్‌ను నిర్థారించవచ్చు.

Also Read:కరోనా వైరస్ రోగులకు ప్రత్యేక ఆస్పత్రి: అనంతగిరిలోనే ఎందుకు?

ఇది అచ్చం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఉపయోగించే బ్రీతింగ్ అనలైజర్’ మాదిరి పనిచేస్తుంది. ఇందులో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్లు, ఫ్యాట్ మాలెక్యూల్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వద్ద ప్రయాణికులను తనిఖీ చేయడానికి ఈ విధానం ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు.